ఎస్పీ విచారణకు గైర్హాజరైన తులసీ బాబు
ఒంగోలు టౌన్: మాజీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కస్టడీ కేసులో విచారణాధికారి అయిన ఒంగోలు ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా గుడివాడకు చెందిన కామేపల్లి తులసీ బాబుకు నోటీసులు ఇచ్చి ఉన్నారు. ఆయన శుక్రవారం ఎస్పీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో తాను విచారణకు హాజరు కాలేక పోతున్నానని, ఈనెల 6, 7 తేదీల్లో హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఎస్పీని కోరినట్లు సమాచారం.
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల వివరాలు అప్లోడ్ చేయాలి
ఒంగోలు టౌన్: క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. డీఎంహెచ్‌ఓ చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆశా, ఏఎన్‌ఎంల ద్వారా రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి శిబిరాలకు తీసుకురావాలని చెప్పారు. ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేసేందుకు ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాంకేతిక లోపం ఉంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ నోడల్ అధికారి డా.భగీరథి, ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.పద్మజ, డీబీసీఎస్ డా.నళిని, జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, ఎపిడిమియాలజిస్ట్ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కాషాయదళం
● హైందవ శంఖారావానికి ముందస్తుగా ఒంగోలులో భారీ బైక్ ర్యాలీ
ఒంగోలు మెట్రో: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు సన్నాహకంగా ఒంగోలులో శుక్రవారం సాయంత్రం వందలాది మంది హిందువులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. ముందుగా పొలిమేర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డీజే పాటలతో జైశ్రీరామ్ నినాదాలతో కాషాయ పతాకాలు చేపట్టి ముందుకు సాగారు. త్రిపుర భైరవానంద స్వామి శంఖారావం పూరించి బైక్ ర్యాలీ ప్రారంభించారు. విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, నగరంలోని హైందవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment