ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ నేడు
ఒంగోలు అర్బన్: షెడ్యూల్ కులాల వర్గీకరణపై అభిప్రాయ సేకరణ, వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం స్పందన భవనంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై అభిప్రాయ సేకరణ చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని ఆ మేరకు కమిషన్ ఛైర్మన్ మిశ్రా అధ్యక్షతన సోమవారం స్పందన భవనంలో షెడ్యూల్ కులాల ప్రజలు, ఉద్యోగులు, వివిధ సంఘ నాయకులతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిప్రాయాలు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్ కులాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాల నాయకులు సద్వినియోగం చేసుకుని అభిప్రాయాలు తెలపాని కోరారు.
డీఈఓను కలిసిన వైఎస్సార్‌టీఏ నాయకులు
ఒంగోలు సిటీ:
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు మట్టిగుంట మహేశ్వరరావు ఆధ్వర్యంలో డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఈఓకు వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ 2025 నూతన డైరీ, క్యాలెండరును అందించారు. ఈ సందర్భంగా మట్టిగుంట మహేశ్వరరావు మాట్లాడుతూ మార్కాపురం, చీరాల మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సిలింగ్ లో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి, తెలుగు రెండు ప్రమోషన్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. డీఈఓను కలిసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతం రమణారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు పల్లప్రోలు శేశిరెడ్డి, బొజ్జా సురేష్, డి.శాంతారావు ఉన్నారు.
9,10,11న ఒంగోలులో తబ్లీగ్ ఇస్తిమా
ఒంగోలు టౌన్:
ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిజాముద్దిన్ తబ్లీగ్ ఇస్తిమా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరక్టర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు షేక్ మహబూబ్ తెలిపారు. ఆదివారం ఆయన ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో జరుగుతున్న ఇస్తిమా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఇస్తిమాకు ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి సుమారు 60 వేల మంది వరకు ముస్లింలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలోని 25 ఎకరాల్లో భక్తులకు అవసరమైన మౌలిక వసతులను ఇస్తిమా కమిటీ నాయకుల ఆధ్వర్యంలో పకడ్భందీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇస్తిమాకు నిజాముద్దీన్, హైదరాబాద్ నుంచి మత పెద్దలు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో తబ్లీగ్ జమాయత్ జిల్లా బాధ్యులు సయ్యద్ హమీద్, షేక్ హసన్, మున్వర్, ఇమాంసా, జిలాని, సిరాజ్, ఉమర్, జుబేర్, అన్వర్, ఇక్బాల్, షరీఫ్, అమీర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment