కూటమి దడ
ఉద్యోగుల్లో
ఉద్యోగుల్లో భయాందోళనలు...
వరుస దాడులతో ఉద్యోగులు అభద్రతతో ఆత్మరక్షణలో పడిపోయారు. దాడులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమౌతుందోనన్న భయంతో మౌనంగా ఉంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం నామ మాత్రపు ఖండనలతో సరిపుచ్చుతున్నారు. బుధవారం రైల్వే హెల్త్ ఇన్‌స్పెక్టర్ నంద కిషోర్ యాదవ్ మీద ఆయన కార్యాలయంలోనే దాడి చేసినప్పటికీ ఈ ఘటన గురించి మాట్లాడేందుకు ఉద్యోగులు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నాయకులు తమ అక్రమ వ్యాపారాలకు, దౌర్జన్యాలకు సహకరించాలంటూ అధికారులను బెదిరిస్తున్నారు. మాటవినని వారిపై దాడులకు తెగబడుతున్నారు. వారికి టీడీపీ ఎమ్మెల్యేలూ వత్తాసు పలుకుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోకుండా పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రభుత్వ ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది.
గ్రూప్ వన్ ఆఫీసర్‌కే దిక్కులేదు...
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సరిగ్గా రెండు నెలలకే జిల్లా కేంద్రంలో ఒక గ్రూప్ వన్ అధికారి మీద దాడి జరగడం సంచలనం సృష్టించింది. జిల్లా సహకార సంఘంలో డీసీఏవోగా పనిచేసే రాజశేఖర్ నిజాయితీ కలిగిన అధికారిగా పేరొందారు. జిల్లాలోని సహకార సంఘాల్లో అవినీతి పట్ల కఠినంగా వ్యవహరించారు. కొన్ని సంఘాల మీద విచారణకు ఆదేశించారు. మరికొన్నింటి మీద భారీ జరిమానా విధించారు. దీంతో ఆయనను దారిలోకి తెచ్చుకునేందుకు కొందరు ఉద్యోగులు, టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ముక్కుసూటిగా వ్యవహరించే రాజశేఖర్ వినలేదు. దాంతో ఆయన మీద సెప్టెంబర్ 8వ తేదీ ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాస రావు, వన్ టౌన్ సీఐ నాగరాజు దాడి జరిగిన తీరును పరిశీలించారు. తన కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందిపై రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉండడంతో పెద్దల ఒత్తిడి మేరకు కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరికి డీసీఏఓ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారాలకు తెరదీశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంలో కీలకమైన ఒక గ్రూప్ వన్ అధికారికే రక్షణ కల్పించలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజా సంఘాలు నిలదీశాయి. దీంతో కొందరు ఇంటి దొంగలతో పాటుగా మరికొందరు అధికార పార్టీ నాయకులను కలుపుకొని మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు.
ఒంగోలు టౌన్:
‘‘పచ్చ బిళ్ల తీసుకొని వచ్చిన టీడీపీ కార్యకర్తలను కూచ్చోపెట్టి, టీ ఇచ్చి.. చెప్పిన పనులు చేసి పంపించాలి’’ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి చెప్పిన మాటలివి. మంత్రులే అలా ఉంటే ఇక తెలుగు తమ్ముళ్ల సంగతి చెప్పేదేముంది. తమకు అడ్డెవరన్నట్లు రెచ్చిపోతున్నారు. అక్రమ వ్యాపారాలకు సహకరించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మాట వినని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మొన్న గ్రూప్ ఒన్ అధికారి, నిన్న పోలీసు కానిస్టేబుల్, తాజాగా రైల్వే ఉద్యోగిపై వరస దాడులు జరగడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవాల్సిన ఎమ్మెల్యేలు అందుకు విరుద్ధంగా దాడులను సమర్ధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం జంకుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
రక్షక భటుడికే రక్షణ లేదు...
రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ చేస్తున్న ఒక కానిస్టేబుల్ మీద గత ఏడాది నవంబర్ 19న టీడీపీ నాయకుడు దాడి చేయడం కలకలం సృష్టించింది. తాలూకా పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ముంగమూరు రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ సమీపంలో ఒక హోటల్లో టిఫిన్ చేస్తున్నారు. రోడ్డు పక్కన మోటారు బైకు నిలిపి ఉంచారు. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన నగరంలోని శివ ప్రసాద్ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు బోడపాటి రాంబాబుకు రోడ్డు పక్కన నిలబెట్టిన మోటారు బైకు అడ్డం ఉన్నట్లు కనిపించింది. బైకు అడ్డం తీయమంటూ బూతులు లంకించుకున్నాడు. దాంతో హోటల్ లో టిఫిన్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస రావు బయటకు వచ్చి బైకు తీసేశారు. అయినా శాంతించని రాంబాబు తిడుతూ కానిస్టేబుల్ మీద దాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆయన మీదకు కారు ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి తాలూకా పోలీసు స్టేషన్ కు ఫోన్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. రాంబాబు మీద కేసు పెట్టకుండా రాజీ చేసేందుకు ఒత్తిడి చేసినట్లు పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. రోజుల తరబడి కథ నడిపిన తరువాత ఒక రోజు సాయంత్రం రాంబాబును అరెస్టు చేసినట్లు చూపించి నోటీసు ఇచ్చి ఇంటికి పంపించారు. ఏకంగా పోలీసుల మీద దాడి పాల్పడినా నిందితుడిని కఠినంగా శిక్షించకుండా మర్యాద చేసి వదిలి పెట్టడంతో పోలీసు వర్గాలు విస్మయానికి గురయ్యాయి.
కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులపై పెరిగిన దాడులు వరుస దాడులతో ఉద్యోగుల బెంబేలు అధికార మదంతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు మాట వినకపోతే దాడులు, బదిలీల బహుమానం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అభద్రత
సంతకాలు చేయలేదని హత్యాయత్నం...
విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు తాణికొండ రాధాకృష్ణ ఒంగోలుతో పాటు తెనాలి, భీమవరం, గుడూరు రైల్వే స్టేషన్లలో క్లీనింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. ప్రతినెలా బిల్లులు పెట్టుకోవాల్సి ఉండగా నిబంధనలకు వ్యతిరేకంగా ఒకేసారి 4 నెలల బిల్లులపై సంతకాలు చేయమంటూ రాధాకృష్ణ సోదరుడు గిరిధర్ ఈ నెల 5 వ తేదీన ఒంగోలు రైల్వే స్టేషన్ కు వచ్చి రైల్వే హెల్త్ ఇన్‌స్పెక్టర్ నంద కిషోర్ యాదవ్ పై ఒత్తిడి చేశారు. ఫైళ్లు పరిశీలించేందుకు కొంత సమయం ఇవ్వమని అడిగినందుకు ఆయన చొక్కా పట్టుకొని కొట్టారు. అతడి నుంచి తప్పించుకున్న నంద కిషోర్ ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. దగ్గరలో ఉన్న జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మీదనే ఫిర్యాదు చేస్తావా అంటూ రెచ్చిపోయిన గిరిధర్ ఆఫీసులోనే హెల్త్ ఇన్‌స్పెక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దాడిలో నందకిషోర్ చేయి విరిగింది.
దాడులపై ఎమ్మెల్యేల జోక్యం...
అధికారుల మీద దాడులు చేసిన వారిపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయకుండా, ఒక వేళ చేసినా నిందితులను అరెస్టు చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడాన్ని గత ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకునేవి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులే స్వయంగా దాడికి పాల్పడం దుర్మార్గమని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు ఇటీవల కొందరు పోలీసులను ఇంటికి పిలిపించుకొని తమ మాట వినకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment