ముహూర్తం కుదిరింది !
ఒంగోలు మెట్రో: మాఘమాసం రాకతో జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి నెలకొంది. గత డిసెంబర్ నెల నుంచి జనవరి నెలాఖరు వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈనెల 2వ తేదీ నుంచి మాఘమాసం రావడంతో అప్పటి నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్ లో జిల్లాలో సుమారు 5 వేలకుపైగా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నాయి. ఒక్క ఈనెలలోనే వెయ్యికిపైగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న వారి ఇళ్లల్లో పెళ్లి హడావుడి మొదలైంది. వివాహ శుభకార్యాలకు అవసరమయ్యే కళ్యాణ మండపాలు, డెకరేషన్, క్యాటరింగ్ నిర్వాహకులు, పురోహితులకు మంచి గిరాకీ ఏర్పడింది. కళ్యాణ మండపాలకు ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ధరలు కూడా గతం కంటే ఈసారి ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాల సీజన్ తో వివిధ వర్గాల వారికి చేతి నిండా పనిదొరుకుతోంది. డెకరేషన్, క్యాటరింగ్, భజంత్రీలు, పురోహితులు, పూలవ్యాపారులకు ఉపాధికి ఇబ్బంది లేకుండా ఉంటోంది. వస్త్ర, బంగారు వ్యాపారాలకు కూడా ఇది మంచి సీజన్. జిల్లాలో 150 కళ్యాణ మండపాలు ఉండగా, ఒంగోలు నగరంలోనే 36 ఉన్నాయి. ఏసీ కళ్యాణ మండపానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు మండప నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. నాదస్వర కళాకారులు ఒంగోలులో 350 మంది ఉండగా, జిల్లా వ్యాప్తంగా 3 వేల మందికిపైగా ఉన్నారు. ఒంగోలు నగరంలో వివాహాది శుభకార్యాలు చేయించే పురోహితులు 80 మంది వరకు ఉండగా, జిల్లావ్యాప్తంగా 5 వేల మంది ఉన్నారు.
నాలుగు నెలల పాటు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు వివాహ బంధంతో ఒక్కటి కానున్న 5 వేలకుపైగా జంటలు కళ్యాణ మండపాలకు డిమాండ్ వేలాది మందికి ఉపాధి
మంచి ముహూర్తాలు ఇవీ..
ఫిబ్రవరి (మాఘమాసం):
13, 14, 18, 19, 20, 21, 23, 25
మార్చి నెల (ఫాల్గుణ మాసం):
1, 2, 6, 7, 12
ఏప్రిల్ నెల (చైత్ర మాసం):
14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
మే నెల (వైశాఖ మాసం):
1, 5, 6, 8, 15, 17, 18
జూన్ నెల (జ్యేష్ట మాసం):
1, 4, 7 తేదీలు
Comments
Please login to add a commentAdd a comment