మిర్చి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలి
ముండ్లమూరు(దర్శి): జిల్లాలోని మిర్చి పంటలు వేసిన రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ డిమాండ్ చేశారు. మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారంలో మిర్చి రైతులను శనివారం బూచేపల్లి పరామర్శించారు. వారి కష్ట నష్టాలు తెలుసుకునేందుకు మిరప రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు తమ ఆవేదనను బూచేపల్లితో వెలిబుచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని చెప్పారు. కల్తీ మందులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. బ్యాంకుల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గత ప్రభుత్వంలో క్వింటా మిరప ధర రూ.25 వేలు ఉండగా, ఇప్పుడు కనీసం రూ.11 వేలు కూడా లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో రైతులకు మిరప పంట దిగుబడులు బాగా వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వంతో కల్తీ పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం చంద్రబాబు వాటిని అరికట్టలేకపోయారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలు ఇస్తూ, రైతు భరోసా కల్పించారని, పంటలకు ఉచిత బీమా కల్పించి, నష్టపోయిన రైతులను ఆదుకున్నారని గుర్తు చేఽశారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి రైతులను నిలువునా మోసగించారన్నారు. ప్రతి ఏడాది రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఎనిమిది నెలలు గడిచినా రూపాయి విదిల్చిన పాపాన పోలేదన్నారు. పంట నష్ట పోయిన రైతుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో దళారులు రాజ్యమేలుతున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వడ్డీల కు తెచ్చుకుని పంటలు వేసుకున్న రైతులు ఆ వడ్డీలు ఎక్కడ పెరుగుతాయో అని తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, గ్రామ సర్పంచ్ వేముల శ్రీను, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బంకానాగిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ సూదిదేవర అంజయ్య, చింతల అంజిరెడ్డి, చింతల కృష్ణారెడ్డి, సోమేపల్లి సుబ్బయ్య, మాజీ ఎంపీటీసీ గుజ్జులశ్రీను, నాయకులు పాల్గొన్నారు.
నష్టపోయిన మిరప రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలి కూటమి ప్రభుత్వంలో దళారులదే రాజ్యం క్వింటా రూ.25 వేలకు కొనుగోలు చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment