పాతికేళ్ల సంకల్పం ఇంతింతై..
● ఆర్టీసీ బస్టాండ్‌లో పాతికేళ్ల క్రితం నాటిన మొక్కలను చూసేందుకు వచ్చిన రిటైర్డ్ ఈడీ ● మొక్కలు పెంచి సంరక్షించిన ఆర్టీసీ మేసీ్త్రలకు సత్కారం
చీమకుర్తి: ఒంగోలు ఆర్టీసీ ఆర్‌ఎంగా 25 సంవత్సరాల క్రితం పనిచేసి ప్రస్తుతం రిటైర్డ్ ఆర్టీసీ ఈడీ, వృక్షమిత్ర రాష్ట్ర ఫౌండర్‌గా ఉన్న ఎంవీ నాగవేంద్రరావు శనివారం చీమకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు చక్కటి నీడనిస్తున్న మహా వృక్షాలను చూసేందుకు వచ్చారు. ప్రయాణికులకు నీడనిచ్చేందుకు నాగవేంద్రరావు చొరవతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనేక మొక్కలను స్వయంగా ఆయన దగ్గరుండి నాటించారు. తదుపరి బదిలీలు, పదోన్నతులతో చివరకు ఆర్టీసీ ఈడీగా రిటైర్ అయి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినా చీమకుర్తి బస్టాండ్ ఆవరణలో తాను నాటించిన మొక్కలు నేడు మహా వృక్షాలైన సంగతి తెలుసుకొని వాటిని సంరక్షించిన స్థానిక ఆర్టీసీ మేసీ్త్రలను పలకరించి వృక్షాలను చూసేందుకు వచ్చారు. ఆయనతో పాటు ప్రస్తుత ఒంగోలు ఆర్‌ఎం బీ.సుధాకర్, ఒంగోలు, కనిగిరి డీఎంలు శ్రీనివాసరావు, షయనాజ్, లయన్స్‌క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ బీ.జవహర్, కంట్రోలర్ పరాంకుశం శ్రీనివాసమూర్తితో పాటు ఆర్టీసీ సిబ్బంది ఆయన వెంట వచ్చారు. తను నాటిన మొక్కలు పెద్ద వృక్షాలుగా మారటంతో పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయా మొక్కలను పెంచి పెద్ద చేసి సంరక్షించిన మేసీ్త్రలు చాంద్‌బాషా, చింతగింజల సుబ్బారావు, ఎనిమిరెడ్డి ఎరుకలరెడ్డిని శాలువాలతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మళ్లీ బస్టాండ్ ఆవరణలో మరో మూడు మొక్కలను నాటించి స్థానికులకు స్ఫూర్తినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment