ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా
● ఉపాధ్యాయ ఓటర్లు 874 ● పట్టభద్రులు 21,614
సిరిసిల్ల: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం వెల్లడించారు. జిల్లా పరిధిలో 874 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని, పట్టభద్రులు 21,614 మంది ఉన్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితాలో వేములవాడ డివిజన్ పరిధిలో 227 మంది పురుషులు, 93 మంది మహిళా ఓటర్లు, సిరిసిల్ల డివిజన్ పరిధిలో 406 మంది పురుషులు, 148 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో 633 మంది పురుషులు, 241 మంది మహిళా ఉపాధ్యాయులతో తుదిజాబితా తయారు చేసినట్లు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితాలో వేములవాడ డివిజన్‌లో 5,310 మంది పురుషులు, 3,404 మంది మహిళా ఓటర్లు, సిరిసిల్ల డివిజన్ పరిధిలో 7,980 మంది పురుషులు, 4,920 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు.
అడుగడుగునా తనిఖీలు
సిరిసిల్లక్రైం/వేములవాడ: నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్న వేళ పోలీస్‌శాఖ పకడ్బందీగా ముందుకెళ్తోంది. జిల్లా ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నుంచే జిల్లాలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పర్యటించిన ఎస్పీ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలకు లోబడి కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని, టపాసులు పేల్చడం, డీజేల ఏర్పాటు నిషేధించినట్లు పేర్కొన్నారు.
‘వర్కర్ టు ఓనర్’ ప్రారంభించాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిరిసిల్లలో నేతకార్మికుల కోసం ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. హైదరాబాద్‌లోని టెస్కో జీఎం అశోక్‌రావును సోమవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆర్వీఎం, ఇతర వస్త్రాలకు సంబంధించి పవర్‌లూమ్ కార్మికులకు, వైపని, వార్పిన్, అనుబంధ రంగాల కార్మికులకు మెరుగైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2023 ఏడాదికి బతుకమ్మ చీరల 10 శాతం సబ్సిడీని వెంటనే అందించాలని కోరారు. నాయకులు సిరిమల్ల సత్యం, నక్క దేవదాసు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment