ఎస్పీ అఖిల్ మహాజన్‌లకు పత్రం అందిస్తున్న ఈమె మిట్టపల్లి పద్మ.
పట్టాలు పొందిన బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్
కేసుల భయంతో అసైన్డ్ భూములు వాపస్
ఇప్పటికే 300 ఎకరాల అక్రమ పట్టాల గుర్తింపు
జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలకు బిగుస్తున్న ఉచ్చు
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లకు పత్రం అందిస్తున్న ఈమె మిట్టపల్లి పద్మ. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్. ఆమె పేరిట 2018లో తాడూరు శివారులోని సర్వేనంబర్ 545/1/1/3/1లో రెండెకరాల ప్రభుత్వ భూమికి పట్టా పొందారు. తనకు కేటాయించిన ఆ రెండు ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ పద్మ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తూ కలెక్టరేట్‌కు వచ్చి పాస్‌బుక్కును అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా పట్టా పొందితే ఆ భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని తెలిపారు. ఆ భూములను పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు వినియోగిస్తామన్నారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతుబంధు, పంటరుణం వంటి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన వారికి ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
తంగళ్లపల్లి మండలం తాడూరు శివారులోని సర్వేనంబర్ 1148లో 11 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టాలు పొందారని తహసీల్దార్‌కు అందిన ఫిర్యాదుతో తాడూరు మాజీ సర్పంచ్ భర్త సురభీ నవీన్‌రావును రెండు రోజుల కిందట అరెస్ట్ చేశారు. భూమిని అక్రమంగా పట్టాలు పొందారని సురభీ సుధాకర్‌రావు, సురభీ సురేందర్‌రావులపై తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా బీఆర్‌ఎస్‌కు చెందిన సిరిసిల్ల బీసీ సంఘం నాయకులు బొల్లి రామ్మోహన్, బీఆర్‌ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సోదరుడు జిందం దేవదాస్, సర్ధాపూర్ మాజీ సర్పంచ్ ఒజ్జెల అగ్గిరాములును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలు జిల్లాలో భూకంపాన్ని సృష్టిస్తున్నాయి.
సిరిసిల్ల: పేదల పేరిట పెద్దలకు పట్టాలిచ్చిన అసైన్‌మెంట్ భూములపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత పదేళ్లుగా ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై విచారిస్తున్నారు. ప్రభుత్వ అసైన్‌మెంట్ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన భూముల వివరాలు సేకరించి, నివేదిక సిద్ధం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారపార్టీ నేతలకు ప్రభు త్వ భూములను పట్టాలుగా కట్టబెట్టిన తీరుపై కలెక్టర్ సందీర్‌కుమార్‌ఝా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 300 ఎకరాల అసైన్‌మెంట్ భూములు అక్రమంగా అప్పటి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది.
ఈమేరకు అర్హత లేకున్నా పట్టాలు పొందిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలా? పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు వెనక్కి తీసుకోవాలా? ధరణి పోర్టల్ రద్దవుతున్న నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్ట పరి ధిలో చర్యలు తీసుకోవాలా? అనే కోణంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారిస్తోంది. అప్పట్లో పట్టాలు అందించిన రెవెన్యూ అధికారులపైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
అసైన్‌మెంట్ కమిటీ సిపార్సులపై ఆరా
అసైన్‌మెంట్ కమిటీ సిపార్సుల మేరకు ఎవరెవరికి ఏ ఊరిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు? ఎంత కేటాయించారు? ఆ పట్టా పొందిన వ్యక్తి ఇప్పుడు కబ్జాలో ఉన్నారా? ఇతరులకు అమ్ముకున్నారా? నిజానికి ఆ పట్టా పొందిన వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? అతనికి అప్పటికే ఏమైనా పట్టాభూమి ఉందా? ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి కేటాయించారా? ఇప్పుడు భూమి స్థితిగతులు ఏమిటి? అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
సమగ్ర వివరాలు సేకరించి అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టాలు పొందిన వ్యక్తి పేదవాడైతే నిజంగానే అర్హత ఉంటే.. అలాంటి వారిపై ఎలాంటి కేసులు ఉండబోవని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అధికారుల అండతో ప్రభుత్వ భూమిని చెరపడితే కేసులు నమోదుచేయాలని భావిస్తున్నారు.
వాపస్ ఇద్దామా.. వేసి చూద్దామా?
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు పొందిన వారు తాజా పరిణామాల నేపథ్యంలో పట్టాలు పొందిన భూమిని కలెక్టర్‌కు వాపస్ ఇద్దామా? లేక.. వేసిచూద్దామా? అనే ఆలోచనలో పడ్డారు. పట్టాలు పొందిన బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసు కేసులు నమోదవుతున్న తరుణంలో లక్ష్మీ పూర్ మాజీ సర్పంచ్‌లాగా భూమిని వాపస్ ఇచ్చి కేసుల నుంచి బయటపడదామా? లేక.. రెవెన్యూ అధికారుల చర్యలను కోర్టులో ఎదురుకొందామా? అనే ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా అసైన్‌మెంట్ భూముల కేటాయింపులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. అప్పటి కేటాయింపులు చర్చకు తెరలేపాయి.
Comments
Please login to add a commentAdd a comment