బిల్లుల సాధనకు భారీ ఉద్యమం
● కవితను కలిసిన మాజీ సర్పంచులు
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ బిల్లుల సాధనకు త్వరలోనే భారీ ఉద్యమం చేపట్టనున్నట్లు మాజీ సర్పంచుల సంఘం ప్రతినిధులు అక్కెనపెల్లి కరుణాకర్, చెన్నమనేని స్వయంప్రభ తెలిపారు. గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి పెండింగ్ బిల్లుల సాధనకు మద్దతు కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా మాజీ సర్పంచులు చేసిన పనుల బిల్లుల చెల్లింపులపై మీనమేషా లు లెక్కిస్తోందన్నారు. సంఘం జిల్లా ప్రతి నిధులు దుమ్మ అంజయ్య, తాడెపు ఎల్లం, బొజ్జం మల్లేశం, మ్యాల దేవయ్య, వన్నమనేని వంశీకృష్ణ, గాండ్ల సుమతి, పోపు పరశురాం, ఏనుగులు కేశవరావు, తాడెపు జ్యోతి, కట్కం మల్లేశం, చిందం రమేశ్, గుంటి శంకర్, గుడ్ల శ్రీనివాస్, తంపుల సుమన్ పాల్గొన్నారు.
బార్, బెంచ్ స్నేహపూర్వకంగా ఉండాలి
వేములవాడ: బార్, బెంచ్ స్నేహపూర్వక వాతావరణంలో కక్షిదారులకు న్యాయసేవలందించేందుకు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు. బార్ అసోసియేషన్‌లోని న్యాయవాదులను గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, పలు అంశాలపై చర్చించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, రజనీకాంత్, బొడ్డు ప్రశాంత్, రేగుల దేవేందర్, దివాకర్, విద్యాసాగర్‌రావు, కిశోర్‌రావు, దేవయ్య, నవీన్, అభిలాశ్, అనిల్‌కుమార్, అన్నపూర్ణ, సుజాత, పెంట రాజు, జనార్దన్, నరేశ్, నర్సింగారావు పాల్గొన్నారు.
మిడ్‌మానేరులో 25 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజశ్వేర (మిడ్‌మానేరు) ప్రాజెక్టులో నీటిమట్టం గురువారం 25.60 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి 500 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 350 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 70 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది.
అన్యాక్రాంత భూములను అర్హులకు పంచండి
సిరిసిల్లకల్చరల్: జిల్లాలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల విలువైన భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్న వారిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కబ్జా చేసిన భూములను కలెక్టర్‌కు తిరిగి అప్పగించేందుకు క్యూలు కడుతున్న వైనం చూస్తుంటే భారీ ఎత్తున భూఅక్రమాలు జరిగాయని తెలుస్తోందన్నారు. అప్పటి ప్రభుత్వ మెప్పు పొందేందుకు తహసీల్దార్ స్థాయి అధికారులు సైతం అక్రమార్కులకు భూములను కట్టబెట్టారని ఆరోపించారు. రైతుబంధు డబ్బుల కోసం అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చుకుని పదేళ్లుగా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన నిరపేదలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు పంతం రవి, నల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment