అపార్ ఆలస్యం
● ఐడీ కార్డుల కోసం వివరాల నమోదులో జాప్యం ● టీచర్లకు సకాలంలో ఇవ్వని విద్యార్థులు ● ఆధార్‌కార్డుల్లో తప్పులు సరిచేసేందుకు 10 రోజులు ● సహకరించని తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ● 31 వరకు ప్రభుత్వ గడువు
ఉమ్మడి జిల్లాలోని స్కూళ్లు, విద్యార్థుల వివరాలు
జిల్లా పాఠశాలలు విద్యార్థులు అపార్
(ప్రభుత్వ, ప్రైవేటు) నమోదు
కరీంనగర్ 1,017 1,80,043 7,204
పెద్దపల్లి 721 81,722 15,910
సిరిసిల్ల 678 82,088 6,527
జగిత్యాల 1,103 1,44,238 14,340
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
జాతీయ విద్యావిధానంలో భాగంగా దేశంలో ప్రతీ విద్యార్థి విద్యార్హతల వివరాలు ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్ లేదా అపార్) ఐడీ కార్డుల కోసం చేపట్టిన వివరాల నమోదులో అంతులేని జాప్యం నెలకొంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు తమ వివరాలను సకాలంలో టీచర్లకు అందించకపోవడం, తల్లిదండ్రులు వారికి సహకరించకపోవడం, ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలకు అవగాహన లేక, సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈనెల 31లోగా వివరాల నమోదు పూర్తవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ఏమిటీ అపార్ కార్డు?
అపార్‌కార్డు ఒక రకంగా పౌరులకు మన దేశంలో ఇస్తున్న ఆధార్‌కార్డు వంటిదే. విద్యార్థికి ఇది అకాడమిక్ పాస్‌పోర్టు లాంటిది. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థి ఎక్కడ చదివాడు? ఏ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? వ్యక్తిగత వివరాలు.. ఈ కార్డులో పొందుపరుస్తారు. ప్రతీ కార్డులోనూ 12 అంకెల విశిష్ట సంఖ్య ఉంటుంది. విద్యార్థి ఉన్నత విద్యకు, అవార్డులు, ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలు తదితరాల్లో ఈ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దాని వల్ల అపార్‌కార్డు ఎవరిది? చదువులో వారి ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు ఏమిటన్న విషయాలు సులువుగా తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థి బదిలీ, కౌన్సెలింగ్, ఉద్యోగ దరఖాస్తుల్లో ఇదే ప్రామాణికం కానుంది. కేవలం కేంద్రం తప్ప ఈ వివరాలు ఇతరులు తెలుసుకోలేరు. కాబట్టి, సమాచార భద్రత ఉంటుంది.
స్కూళ్లలో ఏర్పాట్లు పూర్తి
స్కూళ్లలో అపార్ వివరాలను ఆన్‌లైన్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు యూడైస్‌లో పొందుపరుస్తారు. లాగిన్ అయ్యాక.. స్కూల్ రిజిస్టర్‌లో ఉన్న వివరాలను, పిల్లలు తీసుకువచ్చిన ఆధార్ కార్డు వివరాలను పోల్చి చూస్తారు. సరిపోలితే.. నమోదు చేస్తారు. తేడాలుంటే, ఆధార్‌లో లేకపోతే స్కూల్ రిజిస్టర్‌లో మార్పులు చేస్తారు.
ఏంటి సమస్య?
అపార్ నమోదు విషయంలో ఇటు ప్రైవేటు, అటు సర్కారు పాఠశాలలు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
విద్యార్థుల ఆధార్‌కార్డుల్లో చాలా తప్పులుంటున్నాయి. ముఖ్యంగా పుట్టిన తేదీ, ఇంటిపేరు, పేరు, చిరునామాల్లో అనేక అక్షరదోషాలు ఉంటున్నాయి. వీటిని సరిచేసుకొని వచ్చే సరికి వారం లేదా 10 రోజులు సమయం పడుతోంది.
ఒక్కోసారి స్కూల్ రిజిస్టర్‌లోనూ, విద్యాశాఖ వద్ద కొందరు విద్యార్థుల వివరాలు తప్పుగా ఉన్నాయి. వీటిని ముందు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మండలంలో దొర్లిన తప్పులను ఎంఐసీ కో–ఆర్డినేటర్ సాయంతో ఎడిట్ చేస్తున్నారు.
అపార్‌కార్డు వివరాల నమోదుకు తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి. కానీ, చాలామంది తలిదండ్రులకు, విద్యార్థులకు సమాచార, సమన్వయలోపంతో ఈ కన్సెంట్ లెటర్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment