ఆధ్యాత్మిక పట్టణంగా అభివృద్ధి
● శివరాత్రి నాటికి ఆలయ విస్తరణ పనులు ప్రారంభించాలి ● వేగంగా దర్శనం, మంచి వసతి కల్పించాలి ● అంబేడ్కర్ జంక్షన్ వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు ● వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్షించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ ఆఫీస్‌కు ఫర్నీచర్ కొనుగోలు చేయాలని ఏడాది కిందట ఆదేశాలిస్తే ఇప్పటి వరకు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి అన్నదాన భోజనహాల్, సమావేశ మందిరంలో నూతన ఫర్నీచర్ అందుబాటులో తీసుకురావాలన్నారు. భక్తుల వసతి కోసం సూట్‌రూమ్ నిర్మించాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, దోమలు పెరగకుండా రెగ్యులర్ ఫాగింగ్ చేయాలని సూచించారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద బోనాలు, పట్నాల మండపాలు, వెయిటింగ్‌హాల్ నిర్మాణానికి 39 గుంటల భూమి సేకరించామని, రూ.9.90కోట్లతో చేపట్టిన బద్ది పోచమ్మ రిన్నోవేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గుడిచెరువు విస్తరణకు 34 ఎకరాల పట్టా భూమి సేకరించామని, రూ.12కోట్లతో గుడిచెరువు మినీట్యాంక్ బండ్ అభివృద్ధి, ఫ్యామిలీ థియేటర్, విగ్రహం, నీటి సరఫరా, విద్యుత్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్‌ట్రాక్ పనులు శివరాత్రికు ముందు ప్రారంభించుకోవాలన్నారు. చెరువులో ఒక వైపు భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని, మరోవైపు బోటింగ్ సౌకర్యం ఉండేలా మినీ ట్యాంక్‌బండ్ పనులు చేపట్టాలని సూచించారు. అంబేడ్కర్ జంక్షన్ వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. శివార్చన వేదికను సిద్ధం చేయాలని తెలిపారు. వేములవాడ–కోరుట్ల, వేములవాడ–వట్టెంల రోడ్లకు రూ.9.95కోట్లతో చేపట్టిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు శివరాత్రి నాటికి పూర్తికావాలని ప్రభుత్వ విప్ ఆదేశించారు. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆలయ విస్తరణకు డీపీఆర్ పనులు నెలాఖరు నాటికి పూర్తిచేసి, అన్నదాన సత్ర భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు అందించాలన్నారు. ఆలయం లోపల విస్తరణ పనులు శివరాత్రి తర్వాత ప్రారంభించేలా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మాట్లాడుతూ వేములవాడ దేవాలయం సంబంధించి సమావేశ మందిరం, భోజనహాల్‌లో అవసరమైన ఫర్నీచర్‌కు వెంటనే షార్ట్‌టెండర్ పిలిచి మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, టీపీవో అన్సార్, వేములవాడ ఆలయ, ఆర్‌అండ్‌బీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment