అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌

Published Mon, Jan 6 2025 7:19 AM | Last Updated on Mon, Jan 6 2025 7:19 AM

అమృత్

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌

సిరిసిల్ల: జిల్లా కేంద్రంతోపాటు ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో తాగునీటి సమస్యకు త్వరలోనే చెక్‌ పడనుంది. ఇన్నాళ్లు మిషన్‌భగీరథ పైపులైన్‌ లీకేజీలతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నీటి సమస్య ఉండేది. తరచూ పైపులు పగిలిపోవడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0లో భాగంగా మంజూరు చేసిన రూ.73.88కోట్లతో సిరిసిల్లలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి.

మిషన్‌ భగీరథ.. తరచూ లీకేజీలు

మిషన్‌ భగీరథ నీటిపథకం సిరిసిల్ల పట్టణ పరిధిలో లీకేజీలతో సాగుతోంది. రెండో బైపాస్‌ రోడ్డులో మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ మీదుగా రోడ్డు నిర్మించడంతో అపెరల్‌పార్క్‌ వద్ద పైపులైన్‌ తరచూ లీకేజీ అవుతుంది. ప్రతీ వ్యక్తికి నిత్యం 135 లీటర్ల నీటిని సరఫరా చేసే లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో మున్సిపల్‌ పరిధిలో వేసిన పైపులైన్‌కు మిషన్‌ భగీరథ పైపులైన్‌ను అనుసంధానించడంతో నీటి ఒత్తిడిని తట్టుకోలేక లీకేజీలు అవుతున్నాయి. మరోవైపు నీటిలో ఫ్లోరైడ్‌ ఉండడంతో దశాబ్దాల కిందట వేసిన పైపులైన్‌లు పూడుకుపోయి నీటిసరఫరా సవ్యంగా సాగడం లేదు.

కాంట్రాక్టర్లకు రూ.కోట్లు.. ప్రజలకు పాట్లు

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా.. సిరిసిల్ల ప్రజలకు శాశ్వతంగా నీటి సమస్యను తీర్చేందుకు రూ.33కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో కరీంనగర్‌ ఎల్‌ఎండీ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్‌ వేశారు. తరచూ లీకేజీలతో నీరు సరిగ్గా సరఫరా కాలేదు. రగుడు వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ మాత్రం ఇప్పటికీ పట్టణ నీటి సమస్యను తీర్చుతుంది. 36 కిలోమీటర్ల భారీ పైపులైన్‌ వృథాగా మిగిలిపోయింది. బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద నిర్మించి సంపుహౌస్‌ మూలకుపడింది. సాయినగర్‌ పంప్‌హౌస్‌ సైతం ఇప్పుడు పనికిరాకుండా పోయింది. పక్కనే మానేరువాగు నీరు ఉన్నా పంపింగ్‌ లేక వృథాగా ఉంది. మిషన్‌ భగీరథకు ప్రత్యామ్నాయంగా ఈ పంప్‌హౌస్‌ను అందుబాటులో ఉంచుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

అమృత్‌ పూర్తయితే శాశ్వత పరిష్కారం

రానున్న పదేళ్ల అంచనాతో అమృత్‌ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టారు. పెద్దూరు శివారులోని మెడికల్‌ కాలేజీ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌కాలనీలో 260 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కాలనీవాసులకు అవసరమైన నీటిసరఫరా జరగడం లేదు. ఫలితంగా అక్కడ ఉండే పేదలు నీటి ఇబ్బందులు భరించలేక ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను ఖాళీ చేసి మళ్లీ సిరిసిల్ల పట్టణానికి వచ్చి అద్దె ఇళ్లలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సమస్యకు అమృత్‌ 2.0 పథకం శాశ్వత పరిష్కారాన్ని చూపనుంది.

రూ.73.88కోట్లతో తాగునీటి పనులు 14 నీళ్లట్యాంకులు.. 115 కిలోమీటర్ల పైపులైన్‌ విలీన గ్రామాల్లో కొత్తనల్లాలు సిరిసిల్లలో కొనసాగుతున్న పనులు

సిరిసిల్ల పట్టణ స్వరూపం

వార్డులు 39

ఇళ్లు 23,444

విలీన గ్రామాలు 07

నల్లాలు 12,601

విలీన గ్రామాల్లో నల్లాలు 4,819

అమృత్‌లో నిర్మించే వాటర్‌ట్యాంకులు : 14

ప్రధాన పైపులైన్‌ పొడవు : 14.50 కిలోమీటర్లు

కొత్తగా నిర్మించే నల్లా పైపులైన్‌ : 115 కిలోమీటర్లు

కొత్తగా విలీన గ్రామాలు, పట్టణంలో ఇచ్చే నల్లాలు : 8,000

అమృత్‌ 2.0లో వెచ్చించే మొత్తం : రూ.73.88 కోట్లు

ఇది సిరిసిల్ల శివారులోని శాంతినగర్‌లో నిర్మిస్తున్న కొత్త నీళ్లట్యాంక్‌. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0 పథకంలో భాగంగా నిధులు మంజూరు చేసింది. రూ.1.17కోట్లతో 6 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ట్యాంకును నిర్మిస్తున్నారు. కొత్తగా 10లక్షల లీటర్ల సామర్థ్యంతో సాయినగర్‌, గణేశ్‌నగర్‌, చంద్రంపేట, బోనాల, పెద్దూరు, పద్మనగర్‌, రాజీవ్‌నగర్‌, రగుడు, పెద్దబోనాల, చిన్నబోనాల, సర్ధాపూర్‌, బాబాజీనగర్‌, పెద్దూరు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలలో మొత్తం 14 ట్యాంకులు నిర్మించనున్నారు. ఇప్పటికే చిన్నబోనాల, శాంతినగర్‌లలో ట్యాంకుల పనులు మొదలయ్యాయి. ఇవి పూర్తయితే సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కానుంది.

పనులు సాగుతున్నాయి

సిరిసిల్ల శివారులోని చిన్నబోనాల గురుకులం వద్ద, శాంతినగర్‌ నీళ్ల ట్యాంకు వద్ద కొత్తగా వాటర్‌ట్యాంకులు నిర్మిస్తున్నాం. పద్మనగర్‌లో పైపులైన్‌ షిఫ్టింగ్‌ పనులు పెండింగ్‌లో ఉండడంతో అక్కడ పనులు ప్రారంభించలేదు. అమృత్‌ 2.0 పథకంలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభిస్తాం. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించి పట్టణ ప్రజలకు, విలీన గ్రామాలకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తాం.

– వరుణ్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈఈ

No comments yet. Be the first to comment!
Add a comment
అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌1
1/3

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌2
2/3

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌3
3/3

అమృత్‌తో నీటికష్టాలకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement