భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని ఎల్మినేడులో రైతులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అన్నారు. భూ బాధితులకు ఎకరానికి వెయ్యి గజాల ప్లాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాటి ప్రభుత్వం శివన్నగూడ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణలో ఎకరానికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇచ్చిందని తెలిపారు అక్కడ ఉన్న నాలుగు గ్రామల రైతులు భూమి కోల్పోయి ప్రస్తుతం కార్మికులుగా మారారని గుర్తు చేశారు. ఎల్మినేడులో 600 ఎకరాల భూమి సేకరించినప్పుడు పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర లక్ష ఎకరాల భూమి బ్యాంకు ఉందని, దీంతో లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సూచించారు. ప్రతి రైతుకు టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కల్పించాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోసుపల్లి ప్రతాప్, అర్జున్‌రెడ్డి, జక్క రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, దండె శ్రీశైలం, నిర్వాసితుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
Comments
Please login to add a commentAdd a comment