రైతులకు ఇబ్బంది రానీయొద్దు
ఆమనగల్లు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఆమె సూచించారు. ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం సాయంత్రం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. రైతులు పండించిన ధాన్యం గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300, సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి కేటాయించిన రైస్‌మిల్లులకు ధాన్యం తరలించాలని ఆదేశించారు. ఆమె వెంట పీఏసీఎస్ సీఈఓ దేవేందర్, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్, ఏఈఓలు నిఖిత, భూదేవి తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
Comments
Please login to add a commentAdd a comment