● కనీస వసతులు కరువు
మహేశ్వరం: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి శాశ్వత భవనం లేక అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. నగరానికి కూతవేటు దూరంలో కలెక్టర్ కార్యాలయం, శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఇండస్ట్రియల్ పార్కులు, కందుకూరులో త్వరలో ఫోర్త్ సిటీ ఏర్పాటు కానుండడంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రస్తుతం రోజుకు 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ జోరుగా జరిగే సమయంలో రోజుకు 120 నుంచి 150 డాక్యుమెంట్లు అయ్యేవి. తాగునీరు, మూత్ర శాలలు, కూర్చోవడానికి విశ్రాంతి గదులు లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే వారికి తిప్పలు తప్పడం లేదు. భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేక రోడ్డుపైన, ఇళ్ల మధ్య పార్కింగ్ చేస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి స్థల సేకరణ చేసి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment