స్టాక్‌ లేదు! | - | Sakshi
Sakshi News home page

స్టాక్‌ లేదు!

Published Thu, Nov 21 2024 8:09 AM | Last Updated on Thu, Nov 21 2024 8:09 AM

స్టాక్‌ లేదు!

స్టాక్‌ లేదు!

స్టోర్స్‌లో విద్యుత్‌ పరికరాలు లేక ఇబ్బందులు

సీటీపీటీలు, ఎల్టీహెచ్‌ఎల్‌పీ కేబుల్స్‌, ఫిన్స్‌, డిస్క్‌ల కొరత

మెటల్‌ పార్ట్స్‌, సింగిల్‌ కోర్‌ కేబుల్స్‌ సైతం లేవట..

డీడీలు చెల్లించి నాలుగైదు మాసాలైనా చేతికందని విద్యుత్‌ పరికరాలు

ఆందోళనలో గృహ, వాణిజ్య వినియోగదారులు

సాక్షి, సిటీబ్యూరో: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌పహాడ్‌కు చెందిన సత్యనారాయణ..ఈ ఏడాది జులై 26న 11కేవీ సీటీపీటీ సెట్‌ సహా 11 కేవీ హెచ్‌టీ టీవీఎం 20/5ఏ కోసం రూ.6.38 లక్షలు డీడీ చెల్లించారు. ఇప్పటికీ విద్యుత్‌ పరికరాలు సరఫరా కాలేదు. కాంట్రాక్టర్‌ రంగారెడ్డి స్టోర్స్‌కు చేరుకుని మెటీరియల్‌ ఇవ్వాల్సిందిగా కోరగా, స్టాక్‌ లేదని తిప్పి పంపారు.

● సైనిక్‌పురికి చెందిన ఎన్‌.నాగలక్ష్మి ఎల్‌టీ ఎక్స్‌ఎల్‌పీఈ కేబుల్‌ 1 కోర్‌ 120 స్క్వైర్‌ ఎంఎం సహా మరో పది పరికరాలకు ఆగస్టు 10న డీడీ కట్టారు. మూడు నెలలైనా ఇప్పటికీ కేబుల్‌ ఇవ్వలేదు. ఇక సైనిక్‌పురి సెక్షన్‌కు చెందిన వర్థన్‌ ప్రాజెక్ట్‌స్‌ సాధన విహార్‌ విద్యుత్‌ మెటిరియల్స్‌ కోసం జులై 1న డీడీ కట్టారు. ఇప్పటికీ మెటిరియల్‌ అందలేదు. విద్యుత్‌ కాంట్రాక్టర్‌ స్వయంగా స్టోర్‌కు చేరుకుని ఆరా తీస్తే..వారం కిత్రమే మెటీరియల్‌ వచ్చిందని, ఆ వెంటనే స్టాక్‌ ఖాళీ అయిందని ఇంజనీర్లు సెలవిచ్చారు. మళ్లీ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తే? కనీస సమాధానం లేదు.

● ఇది కేవలం సత్యనారాయణ, నాగలక్ష్మి, వర్థన్‌ ప్రాజెక్ట్‌స్‌ వినియోగదారులకు ఎదురైన చేదు అనుభవమే కాదు..విద్యుత్‌ పరికరాలు కోసం రూ.లక్షల చొప్పున డీడీలు చెల్లించిన అనేక మంది గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బంది.

డీడీలు కట్టి..నాలుగైదు మాసాలైనా..

కొత్త పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల్లో విద్యుత్‌ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లే చేస్తున్నారు. నిర్మాణ సమయంలోనే సదరు వినియోగదారుడు డిస్కంకు దరఖాస్తు చేసుకుంటారు. ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇందుకు అవసరమైన విద్యుత్‌ పోల్స్‌, కండక్టర్‌, మెటల్‌ పార్ట్స్‌, ఇన్సులేటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, కేబుల్స్‌, సీటీపీటీలు, ఏబీ స్విచ్‌లు, పీటీఆర్‌లు, ఆర్‌ఎంయూలు, ఆయిల్‌ డ్రమ్స్‌, క్రాస్‌ ఆర్మ్‌లు, ఫ్యూజ్‌ సెట్స్‌, మీటర్లు, ప్యానల్‌ బోర్డులకు అంచనాలు రూపొందించి ఇవ్వగా, సదరు వినియోగదారులు డీడీ రూపంలో డిస్కంకు ఆ మొత్తాన్ని చెల్లిస్తుంటారు. నిజానికి ప్రైవేటు మార్కెట్లో ఆయా విద్యుత్‌ పరికరాలన్నీ దొరుకుతున్నప్పటికీ..సరఫరాలో నాణ్యత, షార్ట్‌ సర్క్యూట్‌ల నియంత్రణ పేరుతో తామే వాటిని స్వయంగా సరఫరా చేయనున్నట్లు డిస్కం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పర్చేజింగ్‌ అండ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆ మేరకు ఆయా తయారీ సంస్థల నుంచి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం మొత్తం 121 రకాల విద్యుత్‌ పరికరాలను ఆయా తయారీ సంస్థల నుంచి దిగుమతి చేసుకుని, హైదరాబాద్‌, రంగారెడ్డి స్టోర్స్‌లో నిల్వ చేస్తుంది. అటు నుంచి సర్కిళ్ల/డివిజన్ల వారీగా దరఖాస్తు దారులకు(సీరియల్‌ నంబర్ల ఆధారంగా) ఆయా విద్యుత్‌ పరికరాలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ నెలలు గడిచినా..స్టోర్స్‌కు ఆయా పరికరాలు రావడం లేదు.

లంచం ఇస్తే ఓకే..

కాగా విద్యుత్‌ పరికరాల సరఫరాకు డిమాండ్‌కు మధ్య భారీ వ్యతాస్యం ఉండటాన్ని ఇంజనీర్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. రూ.5000 ఇస్తే చాలు దరఖాస్తు సీనియార్టీతో సంబంధం లేకుండా కోరిన పరికరాలను అప్పగిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు నిర్ధేశించిన తూకానికి తక్కువగా కండక్టర్‌ అప్పగిస్తున్నారు. ఒక్కో డ్రమ్‌ నుంచి రెండు నుంచి ఐదు కేజీల వరకు తగ్గిస్తున్నట్లు తెలిసింది. ఇన్సులేటర్లు, పిన్స్‌ ఇవ్వకుండా, గుట్టుగా వాటిని ప్రైవేటు దుకాణాలకు తరలిస్తున్నట్లు తెలిసింది.

కాంట్రాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి

డీడీ కట్టిన వారం పది రోజుల్లోనే మెటీరియల్‌ అందజేయాల్సి ఉంది. కానీ కొంత మంది ఇంజనీర్లు ఉద్దేశ పూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇండెంట్లు పంపించి, పరికరాలను దిగుమతి చేసుకోవడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లే ఆయా పరికరాలను ప్రైవేటుగా కొనుగోలు చేసి, పనులు చేయాల్సి వస్తోంది.

–ప్రదీప్‌రెడ్డి, సీనియర్‌ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement