మా రికార్డులు తనిఖీ చేయండి
యాచారం: మండల పరిధిలోని మల్కీజ్‌గూడ గ్రామంలోని వీబీకే(విలేజ్ బుక్ కీపర్) ఫోర్జరీ సంతకాలు, నకిలీ తీర్మానాలు చేసి రూ.20లక్షల వరకు నిధుల స్వాహా చేసి యాచారం ఎస్‌బీఐకి కన్నం పెట్టిన విషయం విధితమే. విషయం తెలసుకున్న డ్వాక్రా సంఘాల మహిళల్లో కొత్త గుబులు మొదలైంది. తమ సంఘాల్లో నిధులేమైనా పక్కదారి పట్టాయేమోనని తెలుసుకునేందుకు చౌదర్‌పల్లి, చింతుల్ల, గడ్డమల్లయ్యగూడ, గునుగల్, యాచారం, నందివనపర్తి, తమ్మలోనిగూడ, మంతన్‌గౌరెల్లి, కొత్తపల్లి, చింతపట్ల, తక్కళ్లపల్లి, నస్దిక్‌సింగారం, నక్కర్తమేడిపల్లి తదితర గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు ఆయా గ్రామాల్లో బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. మండల పరిధిలోని 24 గ్రామాల్లో 43 గ్రామ సంఘాలు, 1,256 స్వయం సహాయక సంఘాలు, మొత్తం 13,310 మంది సభ్యులున్నారు. ఈ సంఘాలకు గాను యాచారం, నందివనపర్తి, మాల్, మీరాఖాన్‌పేట గ్రామాల్లో ఎస్‌బీఐ, మాల్‌లోని యూనియన్ బ్యాంకు, నక్కర్తమేడిపల్లి గ్రామంలోని ఇండియన్ బ్యాంకుల్లో మహిళలు రుణాలు పొందారు.
రూ.వంద కోట్ల లావాదేవీలు
గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు సెర్ప్(గ్రామీణా పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి తదితర పథకాల ద్వారా రుణాలు ఇప్పిస్తారు. 2023–24, 2024–25 రెండేళ్లకు గాను మండలంలోని అర్హత పొందిన సంఘాలకు దాదాపు రూ.80 కోట్ల రుణాలు ఇప్పించారు. 2024–25 ఏడాదికి గాను రూ.50 కోట్ల టార్గెట్‌కు గాను అర్హత కలిగిన 561 స్వయం సహాయక సంఘాలకు రూ.40 కోట్ల రుణాలు ఇప్పించారు. మరో రూ.పది కోట్ల రుణాలు ఇప్పించేందుకు ఆయా బ్యాంకుల వద్ద ప్రతిపాదనలున్నాయి. ఒక్కో సంఘానికి రూ.2 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు రుణాలు ఇప్పించారు.
పర్యవేక్షణ లోపమే
మల్కీజ్‌గూడ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లో జరిగిన రూ.లక్షలాది నిధులు స్వాహా, అవకతవకలు పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపమేనని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ వీబీకే నకిలీ తీర్మానాలు, ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంకుకు వెళ్లి రూ.లక్షలాది నిధులను ఇతర గ్రామాల మహిళల ఖాతాల్లో బదిలీ చేయిస్తే సెర్ప్ సీసీ, ఏపీఎం ఏంచేశారంటూ సంఘాల సభ్యులు మండి పడుతున్నారు. 24 గ్రామాల్లో 43 మంది వీబీకేలు ఉన్నారు. గ్రామ స్థాయిలోని స్వయం సహాయక సంఘాల ఆర్థిక వ్యవహారాలన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. వీబీకేలే నిధుల స్వాహాకు పాల్పడితే ఇంకా పట్టించుకునే వారెవరని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోని వీబీకేలు మహిళలకు రుణాలు ఇప్పించిన వెంటనే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద బలవంతంగా మళ్లీ అప్పులు తీసుకోవడం, బీనామీ పేర్ల మీద రుణాలు పొంది సక్రమంగా వాయిదాలు చెల్లించకపోవడం పరిపాటిగా మారుతుంది. 15 ఏళ్ల క్రితం ఇలాంటి నిధుల స్వాహా వెలుగులోకి వచ్చింది. మళ్లీ మల్కీజ్‌గూడలో నిధుల స్వాహాతో మహిళల్లో కంటికి మీద కునుకు కరువైంది.
తమ సంఘం లెక్కలు తనిఖీ చేయాలంటూ డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రికార్డులు పరిశీలించి తీసుకున్న రుణమెంత? చెల్లించిన అప్పు ఎంత? తదితర వివరాలను చెప్పాలని బ్యాంకు మేనేజర్లను ప్రాధేయపడుతున్నారు.
మల్కీజ్‌గూడ ఘటన నేపథ్యంలో డ్వాక్రా సంఘాల మహిళల్లో ఆందోళన
లెక్కలు చూడాలని బ్యాంకులకు క్యూ
వీబీకేల పాత్రపై అనుమానం
Comments
Please login to add a commentAdd a comment