మందిరాల వద్ద రక్షణ చర్యలు తీసుకోండి
షాద్‌నగర్‌రూరల్: మందిరాలవద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఏసీపీ రంగస్వామి సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో పట్టణ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పూజారులు, ఇమాంలు, ఫాదర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలవద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాత్రి సమయాల్లో మందిరాలు, మసీదులు, చర్చిల్లోకి ఇతరులు ప్రవేశించకుండా తాళం వేసుకోవాలని సూచించారు. తలుపులు గట్టిగా ఉండాలని, సీసీ కెమెరాలు, మందిరాల పరిసరాలు పూర్తిగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవల మందిరాలవద్ద కొన్ని ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అలాంటి వాటిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు సుశీల, రాంచందర్, బల్‌రాం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీపీ రంగస్వామి
Comments
Please login to add a commentAdd a comment