వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
మంచాల: అప్పు తీర్చుతానని చెప్పి ఓ వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తిప్పాయిగూడ గ్రామానికి చెందిన గొర్రెంకల వెంకటేశ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కూతురు పెళ్లికి కొంత అప్పు చేయడంతో నగరంలో ఉన్న ప్లాటును అమ్మేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ క్రమంలో వెంకటేశ్ ఈ ఏడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతికినా లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 77022 20964 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుడు..
పహాడీషరీఫ్: మందుల కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాం కాలనీకి చెందిన ఆదిమూలం సదానందం(75) అనారోగ్యం కారణంగా ఈ నెల 19వ తేదీన ఉదయం ముందులు తెచ్చుకునేందుకని ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై అతని కుమారుడు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో సమాచారం అందించాలని తెలిపారు.
తల్లి మందలించిందని బాలుడు..
ఇబ్రహీంపట్నం రూరల్: తల్లి మందలించడంతో ఇంట్లో నుంచి ఓ బాలుడు పారిపోయిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సోమయ్య కథనం ప్రకారం.. నాదర్‌గుల్ గ్రీన్‌హోమ్స్ కాలనీకి చెందిన కొంగర చందు అనే బాలుడు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. పాఠశాలకు వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఈ నెల 16వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 87125 78845కి తెలియజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment