రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: గత టీఆర్‌ఎస్ హయాంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి 10వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు వెంకటస్వామి విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటివ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. జాతీయ రాజకీయాల్లో ‘కాకా’ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసమే ‘కాకా’ పని చేశారని కొనియాడారు. 80 వేల మంది పేదలకు నీడ కల్పించిన మహోన్నత వ్యక్తి అన్నారు. త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సును తమ కళాశాలలో ప్రవేశపెడుతున్నట్లు అంబేడ్కర్ విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ, కరస్పాండెంట్ సరోజా వివేక్, వెంకటస్వామి కుమార్తెలు వీణ, విజ్జీ, మాజీ మంత్రి డాక్టర్ శంకర్‌రావు, డైరెక్టర్లు డాక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment