సేవలకు ఆటంకం
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన బాట
● సమస్యలు పరిష్కరించేదాకా విరమించేది లేదని స్పష్టీకరణ
● మండల వనరుల కేంద్రాల్లో సమ్మె ప్రభావం
● విద్యాశాఖలో ఆన్‌లైన్ సేవలు బంద్
● ఆగిపోయిన మధ్యాహ్న భోజన బిల్లులు
● కేజీబీవీ, భవిత కేంద్రాల్లో తప్పని తిప్పలు
ఇబ్రహీంపట్నం రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. వారి డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేస్తున్నారు. రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా రోజుకోరకంగా నిరసన తెలుపుతున్నారు. జిల్లాలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 15 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతున్నారు.
సమ్మెతో సకలం బంద్
జిల్లాలోని 27 మండలాల్లో 1,100 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో 739 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్ అనాలసిస్టులు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్లు, డీఎల్‌ఎంటీ, మెసెంజర్లు ఉండగా, మండల స్థాయిలో ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్‌పీలు, మెసెంజర్లు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లసర్టర్ రిసోర్స్ పర్సన్స్, పాఠశాల స్థాయిలో పార్ట్ టైమ్ ఇన్‌స్రక్టర్స్, కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు, అకౌంట్స్, క్రాప్ట్, కంప్యూటర్, వంట మనుషులు, వాచ్‌మన్‌లు, స్వీపర్లు పని చేస్తున్నారు. సమ్మెతో పీఎం పోషణ్, ట్రెజరీకి సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు నిలిచిపోయాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే వంట కార్మికుల బిల్లులను ప్రతీ నెల బ్యాంకులకు పంపించాలి. ఈ బిల్లులను మండల విద్యాధికారి కార్యాలయాల్లో పని చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్ చేసి ట్రెజరీకి పంపిస్తారు. ప్రతి మండలంలో దాదాపు 50 నుంచి 150 మంది వరకు వంట కార్మికులు ఉంటారు. వీరి అకౌంట్లో బిల్లులు జమ చేయాల్సి ఉంటుంది. సమ్మెతో ఈ పనులు నిలిచిపోయాయి. మధ్యాహ్న భోజన ఇండెంట్ ఆన్‌లైన్ చేసే వారు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు నిర్వహించే ఆన్‌లైన్ సేవలన్నీ నిలిచిపోయాయి. మరోవైపు కేజీబీవీలు, భవిత కేంద్రాలు, పాఠశాలల్లో బోధన లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
డిమాండ్లు ఇవే..
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) అవకాశం కల్పించాలి.
ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.20 లక్షలు, ఆరోగ్యబీమా రూ.10 లక్షలు సౌకర్యం కల్పించాలి.
పదవీ విరమణ చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు ఇవ్వాలి.
ప్రభుత్వ, విద్యాశాఖ నియమకాల్లో వెయిటేజీ కల్పించాలి.
పీటీఐలకు నెలకు రూ.12 వేల వేతనం ఇవ్వాలి.
ప్రభుత్వం గుర్తించాలి
సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించాలి. అప్పటి వరకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలి. కుటుంబాలను విడిచిపెట్టి పని చేసే ప్రదేశాలను వదిలి 15 రోజులుగా ఆందోళన బాట పట్టాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
– స్వప్న, జిల్లా నాయకురాలు
రెగ్యులర్ చేయాలి
ఇబ్రహీంపట్నం మండల మానవ వనరుల కార్యాలయంలో 18 సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు పనికి తగిన వేతనం లేదు. విద్యాశాఖలో ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. పని బారెడు జీతం మూరెడు అన్నట్లుగా ఉంది. జిల్లాలో పని చేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలి. అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు.
– జె.సంపత్, సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment