ప్రశాంతంగా వేడుకలు జరుపుకోండి
● న్యూ ఇయర్ వేళ ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దు
● హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
● మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి
మహేశ్వరం: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి సూచించారు. సోమవారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహేశ్వరం జోన్ పరిధిలోని మొత్తం 10 రిసార్ట్‌లు, 62 ఫామ్ హౌస్‌లను అలర్ట్ చేసినట్టు చెప్పారు. ఏడు చోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టనున్నట్టు తెలిపారు. అర్థరాత్రి రోడ్లపై గుర్రాలు, బైక్ రేసింగ్‌ల విషయంలో గట్టి నిఘా పెట్టామన్నారు. డ్రంకెన్ డ్రైవ్, సౌండ్ పొల్యూషన్, బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్ చేసే వారితో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, రోడ్లపై వెళ్లేవారికి ఇబ్బందులకు గురి చేయడం లాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బయటికి పంపించి ఇబ్బందులు పడొద్దని, కుటుంబ సమేతంగా ఇళ్లలో సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మహేశ్వరం జోన్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను అప్రమత్తం చేసినట్టు ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment