కొలిక్కిరాని ‘రైతు భరోసా’!
షాబాద్: రైతులకు వెన్నుదన్నుగా నిలవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. పంటల సాగు ఖర్చుల కోసం ప్రైవేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులను ఆశ్రయించొద్దని, ఆత్మహత్యలు నివారించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతుభరోసా పథకం కింద ఏటా రూ.15వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు ఖరారు కాలేదు. సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజుకో అంశం తెరపైకి వస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది.
సాగులో ఉన్న భూములకే..
గత ప్రభుత్వం వ్యవసాయ భూములన్నింటికీ ఏడాదికి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించింది. భూపరిమితి విధించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలులో కొన్ని షరతులు విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా వ్యవసాయ భూములన్నింటికీ కాకుండా సాగులో ఉన్న భూములకు మాత్రమే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. గతంలో కొండలు, గుట్టలు, వెంచర్లకు సైతం పెట్టుబడి సాయం అందిస్తే ప్రజాధనం వృథా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సాగులో ఉన్న భూములను ఎలా గుర్తిస్తారు. ప్రత్యేకంగా సర్వే చేపడుతారా లేక శాటిలైట్ ద్వారా వివరాలు సేకరిస్తారా అనేది ప్రభుత్వం ఇంకా ఎటూ తేల్చలేదు. గతంలో పడావు ఉన్న భూములకు సైతం యజమానులు రైతుబంధు సాయం అందుకునేవారు. వర్షాకాలంలో సాగయ్యే పంటలతో పోల్చితే యాసంగిలో సాగయ్యే పంటల విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. వానాకాలం పంటల సాగు విస్తీర్ణం లెక్కలోకి తీసుకుని రైతుభరోసా అందిస్తుందా వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా అందిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మార్గదర్శకాలు విడుదలైతేగానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ఏడాదిగా ఎదురుచూపులు
జిల్లాలోని రైతులు రైతు భరోసా కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. గత డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాతపద్ధతిలో యాసంగి పెట్టుబడి సాయం అందించింది. వానాకాలం సీజన్ నుంచి రైతుభరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించింది. విధివిధానాల రూపకల్పన జరగకపోవడంతో ప్రారంభం కాలేదు. తాజాగా సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. మరో 13 రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటికీ విధివిధానాలు ఖరారు చేయలేదు. రైతుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎన్ని ఎకరాలకు సీలింగ్?
వానాకాలంలో సీజన్‌లో జిల్లా రైతులు సుమారు 1.6లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. యాసంగిలో 38 వేల ఎకరాల్లో మాత్రమే సాగు ఉంటుంది. స్థానికంగా ఆశించిన స్థాయిలో సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు ప్రధానంగా వర్షాధార పంటలకే మొగ్గు చూపుతారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుంది. వీటితోపాటు పంటలు, తోటలు, కూరగాయల సాగు మరో 22,500 ఎకరాల వరకు ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలులో భూపరిమితి విధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాలని భావిస్తోంది. ఏడెకరాలా లేక పదెకరాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మార్గదర్శకాలనూ సైతం పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. నూతన మార్గదర్శకాలతో చాలామంది పథకానికి దూరం కానున్నారు.
సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్న సర్కార్
ఇప్పటికీ ఖరారు కాని విధివిధానాలు
రైతుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
షరతులు విధించొద్దు
రైతుభరోసా పథకంలో ఎలాంటి షరతులు విధించొద్దు. రైతులందరికీ వర్తింపజేయాలి. అర్హులకు లబ్ధి చేకూరేలా విధివిధానాలు రూపొందించాలి. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా విధివిధానాలు ప్రకటించకపోవడం బాధాకరం.
– యాదవరెడ్డి, రైతు, బొబ్బిలిగామ, షాబాద్ మండలం
సీలింగ్ లేకుండా అందించాలి
రైతుభరోసా పథకం అమ లులో భూపరిమితి విధిస్తే చాలా మంది రైతులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కుటుంబాన్ని యూ నిట్‌గా తీసుకుని అందరికీ కలిపి పెట్టుబడి సాయం చేస్తే రైతులను మోసం చేసినట్లే. సీలింగ్ లేకుండా సాయం అందించాలి.
– సత్యనారాయణరెడ్డి, రైతు, సంకెపల్లిగూడ, షాబాద్ మండలం
అర్హులకు అన్యాయం చేయొద్దు
పంటలు సాగు చేస్తున్న రైతులకు అన్యాయం చేయొద్దు. అందరికీ మేలు జరిగేలా రైతుభరోసా పథకం విధివిధానాలు రూపొందించాలి. ఇప్పటికే వేలాది మందికి రుణమాఫీ కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
– బంట్టు కిష్టయ్య, రైతు, లక్ష్మరావుగూడ,
షాబాద్ మండలం
Comments
Please login to add a commentAdd a comment