వడివడిగా గ్రీన్‌ఫీల్డ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆకుతోటపల్లి వరకు నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనుల భూసేకరణ వడివడిగా ముందుకు సాగుతోంది. ఇటు ఔటర్ నుంచి అటు ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎలాంటి మలుపులకు ఆస్కారం లేకుండా 330 అడుగుల విస్తీర్ణంలో నేరుగా విశాలమైన రోడ్డును నిర్మించే పనులు వేగవంతం అయ్యాయి. రావిర్యాల ఎగ్జిట్ 13 నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు సుమారు 41.5 కిలోమీటర్ల పరిధిలోని ఈ రోడ్డు పనులను రెండు విడతల్లో చేపట్టనున్నారు. భూసేకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.2 వేల కోట్ల మంజూరుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. భూ సేకరణ పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ సహా పనులను ప్రారంభించే అవకాశం ఉంది.
ఆరు మండలాలు.. 14 గ్రామాలు
మొదటి విడతలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల మీదుగా 20 కిలోమీటర్ల దూరం చేపట్టనున్న రోడ్డుకు 449.27 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ సహా మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది. రెండో విడతలో యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలోని ఐదు గ్రామాల పరిధిలో 21.5 కిలోమీటర్లు చేపట్టనున్నారు. ఈ రోడ్డు కోసం 554.35 ఎకరాల భూ సేకరణకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,725 మంది రైతుల నుంచి 1,004.22 ఎకరాలు సేకరించనున్నట్లు పేర్కొంది. ఆయా సర్వే నంబర్లలో భూ క్రయ విక్రయాలు, అభివృద్ధి పనులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూసేకరణపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లో లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు తెలియజేయాల్సిందిగా సూచించింది. దీనిలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా, హేతుబద్ధమైన పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొంది.
రెండువైపులా ల్యాండ్ పూలింగ్
ఎలివేటెడ్ కారిడార్ వెంట మెట్రోలైన్ విస్తరణ పనులు చేపట్టడంతో పాటు రోడ్డుకు రెండు వైపులా 60: 40 నిష్పత్తిలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలనే ప్రతిపాదనను సైతం తెరపైకి తీసుకొస్తోంది. ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులను పెద్ద ఎత్తున తేవాలని యోచిస్తోంది. చేపట్టే నిర్మాణాలన్నీ ఏకరూపంగా ఉండేలాప్లాన్ చేస్తోంది. రోడ్డుకు రెండు వైపులా అందమైన, ఎత్తయిన మొక్కలను నాటించడం ద్వారా అహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడనుంది. నెట్‌జీరో సిటీగా ఆవిష్కరించనుంది. అంతేకాదు ఇందుకు భూములు ఇచ్చిన రైతులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది.
కొంగర– మీర్‌ఖాన్‌పేట మధ్యలో సర్వే చేపడుతున్న సిబ్బంది
ఔటర్ టు ఆకుతోటపల్లి
రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ
తొలి విడతలో 20 కి.మీ.. 449 ఎకరాలు
రెండో విడతలో 21.5 కి.మీ.. 554.35 ఎకరాలు.. 330 అడుగుల రహదారి
భూ సేకరణ కోసం రెండు విడతల్లో నోటిఫికేషన్లు
రహదారి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల మంజూరుకు ఆర్థిక శాఖ పచ్చజెండా
మొదటి విడతలో భూ సేకరణ
మండలం గ్రామం రైతులు భూమి (ఎకరాల్లో)
ఇబ్రహీంపట్నం ఫిరోజ్‌గూడ 84 1.03
ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ 361 55.05
మహేశ్వరం కొంగరకుర్దు 278 53.20
కందుకూరు లేమూరు 497 84.28
కందుకూరు తిమ్మాపూర్ 290 47.02
కందుకూరు రాచలూరు 351 87.22
కందుకూరు గుమ్మడవెల్లి (రిజర్‌డ్వ్ ఫారెస్ట్) 32.11
కందుకూరు పంజాగూడ (టీఎస్‌ఐఐసీ) 18.33
కందుకూరు మీర్‌ఖాన్‌పేట 48 62.08
రెండో విడతలో భూ సేకరణ
మండలం గ్రామం రైతులు భూమి (ఎకరాల్లో)
ఆమనగల్లు ఆమనగల్లు 331 68.35
ఆమనగల్లు ఆకుతోటపల్లి 229 83.35
యాచారం కుర్మిద్ద 529 144.75
కడ్తాల్ కడ్తాల్ 440 72.67
కడ్తాల్ ముద్వీన్ 1,287 184.76
Comments
Please login to add a commentAdd a comment