‘ఇస్తేమా’కు అంతా సిద్ధం
సాక్షి,సిటీబ్యూరో: శంకర్‌పల్లిలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తబ్లీకి జమాత్ ఇస్తేమా జరగనుంది. ఈ సమ్మేళనానికి లక్షల సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్నారు. ఈ మేరకు 200 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మైనార్టీలు హాజరు కానుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇస్తేమాలో మతగురువులు ఇస్లాం ధర్మం ముఖ్య అంశాల గురించి ఉపదేశాలు చేయనున్నారు. మౌలానా అస్లం నాగ్‌పూరీ, మౌలానా ఖాసీం ఖురేషీ, మౌలానా షౌకత్ షితాపూరీ, మౌలానా మహ్మద్ ముస్తాఖ్ ఖాస్మీతోపాటు పలువురు మత ప్రముఖులు వివిధ అంశాలపై ధార్మిక ఉపదేశాలు ఇవ్వనున్నారు. ఆయా జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారికోసం ఎక్కడివారు అక్కడే వంట చేసుకోవడానికి, విశ్రమించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సమ్మేళనానికి లక్షల సంఖ్యలో ముస్లింలు వస్తున్నందున పోలీసుశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
వైద్య సేవలు అందించాలి
శంకర్‌పల్లి: పట్టణ శివారులో ఈనెల 3,4,5 తేదీల్లో నిర్వహించే ఇస్తేమా కార్యక్రమంలో 24గంటల పాటు వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరావు అన్నారు. ఇస్తేమా జరిగే ప్రదేశాన్ని గురువారం ఆయన వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం శంకర్‌పల్లి పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్రబాబుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. ఇస్తేమా జరిగే ప్రదేశంలో రెండు ఆస్పత్రులు, ఐదు క్లినిక్స్, ప్రతి రోజు 32 మంది(మూడు షిఫ్టుల్లో) సిబ్బంది విధులు నిర్వర్తించాలని, రెండు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇస్తేమా వారి ప్రత్యేక వైద్య బృందాలు సైతం ఉంటాయని, వారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మూడు రోజుల పాటు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి పీహెచ్‌సీ వైద్యురాలు డా.రేవతిరెడ్డి, టంగటూర్ పీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
శంకర్‌పల్లిలో నేటి నుంచి మూడురోజుల పాటు కార్యక్రమం
ధార్మిక ఉపదేశాలు ఇవ్వనున్న మత గురువులు
పెద్ద సంఖ్యలో హాజరుకానున్న ముస్లింలు
ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం
ట్రాఫిక్ మళ్లింపు
చేవెళ్ల: శంకర్‌పల్లిలో జరుగుతున్న ఇస్తేమా కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందు లు తలెత్తకుండా వాహనాల మళ్లింపులు చేపట్టినట్టు చేవెళ్ల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశం తెలిపారు. ఉన్నతాధికారుల సూచనతో మళ్లింపు చేపడుతున్నట్లు చెప్పారు. వాహనదారులు గమనించాలని సూచించారు.
తాండూరు, వికారాబాద్ నుంచి సంగారెడ్డి పటాన్‌చెరు వైపు వెళ్లే భారీ వాహనాలు మోమిన్‌పేట సదాశివపేట నుంచి సంగారెడ్డి, పటాన్‌చెరుకు వెళ్లాలి.
తాండూరు, వికారాబాద్ నుంచి సంగారెడ్డి, బీడీఎల్, పటాన్‌చెరుకు వచ్చే భారీ వాహనాలు ముత్తంగి టోల్‌గేట్ వద్ద ఓఆర్‌ఆర్ ఎగ్జిట్–3 ద్వారా చేవెళ్ల – టీఎస్‌పీఏ– ఓఆర్‌ఆర్ ద్వారా వెళ్లాలి.
పరిగి, షాద్‌నగర్ నుంచి సంగారెడ్డి, ఓడీఎఫ్ పటాన్‌చెరు వెళ్లే భారీ వాహనాలు శంషాబాద్ ఓఆర్‌ఆర్– నార్సింగి, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ –3 మీదుగా ముత్తంగి లోట్‌గేట్ నుంచి పటాన్‌చెరు – ముంబై హైవే మీదుగా ప్రయాణించాలి.
సంగారెడ్డి, పటాన్‌చెరు, బీడీఎల్ నుంచి షాద్‌నగర్ పరిగి వైపు వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్–3 మీదుగా ముత్తంగి టోల్‌గేట్– శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 16– బెంగళూరు హైవే షాద్‌నగర్ మీదుగా వెళ్లాలి.
నార్సింగి నుంచి శంకర్‌పల్లికి వచ్చే భారీ వాహనాలను టీఎస్‌పీఏ నార్సింగి– మొయినాబాద్– చేవెళ్ల– వికారాబాద్ మీదుగా మళ్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment