సహకారం.. ప్రక్షాళన పర్వం!
అనర్హుల ఏరివేత ప్రక్రియ ప్రారంభం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యత్వాల ప్రక్షాళన మొదలైంది. ఇప్పటికే భూములు అమ్ముకున్న వాళ్లతో పాటు చనిపోయిన వాళ్లు కూడా సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరి సభ్యత్వాన్ని తొలగించే ప్రక్రియకు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు శ్రీకారం చుట్టాయి. ఇందుకోసం సొసైటీల్లోని సభ్యుల ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించాయి. బ్యాంకు అకౌంట్లకే కాకుండా సంఘాల్లోని సభ్యత్వానికి ఈకేవైసీ అనుసంధానించడం ద్వారా పరపతి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు కేంద్రం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌లను పునర్వి భజించి కొత్తగా మరికొన్ని ఏర్పాటు చేసి గ్రామీణ రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేయాలని యోచిస్తున్నారు.
లొసుగులకు ఈకేవైసీతో చెక్
జిల్లా సహకార సంఘం పాలక మండలితో పాటు మండల సహకార సంఘం పాలక మండళ్ల గడువు ఫిబ్రవరితో ముగియనుంది. డీసీసీబీలో చైర్మన్, వైస్ చైర్మన్ సహా 21 మంది డైరెక్టర్లు ఎన్నుకోబడతారు. అదే పీఏసీఎస్‌లో 11 మంది డైరెక్టర్లు ఒక చైర్మన్ మరో వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకమండళ్ల గడువు ముగియనుండడంతో కొత్తగా మళ్లీ ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనర్హులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సభ్యుల్లో అనేక మంది ఏళ్ల క్రితమే సభ్యత్వం పొందారు. ఆ తర్వాత వీరిలో కొంతమంది భూములను అమ్ముకున్నారు. మరికొంత మంది వృద్ధాప్యం, ఇతర కారణాలతో చనిపోయారు. ఇంకొంత మంది తమ భూములను పిల్లల పేరున మార్చారు. బ్యాంకుల్లో రుణాలు, పేరుపై భూమి లేకపోయినా వీరంతా ఇప్పటికీ సభ్యులుగా కొనసాగుతున్నారు. అంతే కాదు మండల సరిహద్దు గ్రామాల్లోని కొంత మంది రైతులకు రెండు మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో భూములు ఉంటున్నాయి. వీరు ఆయా కేంద్రాల్లో రుణాలు తీసుకోవడంతో పాటు సొసైటీల్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటున్నారు. ఒకే వ్యక్తి రెండు, మూడు సొసైటీల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సొసైటీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే స్థాయికి చేరుకోవడంతో డైరెక్టర్లుగా ఎన్నికై .. రుణాల మంజూరీలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి లొసుగులన్నింటికీ ఈకేవైసీ ద్వారా చెక్ పెట్టొచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు కసరత్తు
ప్రస్తుతం జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండగా, వీటిలో మొత్తం 1,66,105 మంది సభ్యులు ఉన్నారు. కందుకూరులో అత్యధికంగా 12,997 మంది సభ్యులు ఉండగా, బాటసింగారంలో 11,508 మంది ఉన్నారు. షాబాద్‌లో 10,943 మంది, తలకొండపల్లిలో 10,331 మంది సభ్యులు ఉన్నారు. మిగతా పీఏసీఎస్‌లలో ఐదు నుంచి ఏడు వేల మంది వరకు ఉన్నారు. వీరిలో కొంతమంది చనిపోగా, మరికొంత మంది భూములు అమ్ముకున్నారు. ఇంకొంత మంది భూములను ప్రభుత్వం సేకరించి, పాసు బుక్‌లను రద్దు చేసింది. వీరంతా ఇప్పటికీ సభ్యులుగా కొనసాగుతుండటం సాంకేతికంగా పలు సమస్యలకు కారణమవుతోంది. నిజానికి సహకార చట్టం ప్రకారం భూమి లేని వాళ్లు సొసైటీల్లో సభ్యులుగా అనర్హులు. ఏళ్లుగా బోగస్ సభ్యులను ఏరివేయక పోవడంతో ప్రస్తుతం వారి సంఖ్య రెట్టింపైంది. ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌ల విభజన ద్వారా జిల్లాలో కొత్తగా మరో 15 నుంచి 15 సంఘాల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. బ్యాంకులపై ఒత్తిడి కూడా తగ్గనుంది. మారుమూల ప్రాంతాల్లోని రైతులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈకేవైసీతో సభ్యుల పేర్లు అనుసంధానం
ఫిబ్రవరితో ముగియనున్న పాలక మండళ్ల గడువు
పారదర్శకంగా పరపతి సంఘాల ఎన్నికల నిర్వహణ
రైతులకు మరింతగా పీఏసీఎస్‌ల సేవలు
Comments
Please login to add a commentAdd a comment