ఆందోళనలపై పోలీసు నిఘా
యాచారం: ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి రేవంత్‌రెడ్డి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్య, అల్లర్లు ఉండరాదని, అలా జరిగితే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీకి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నేరుగా సీఎంఓ నుంచి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పట్టా భూముల పరిహారం అథారిటీలో జమ చేసిన రైతులకు మరింత పెంచి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇటేవలే కుర్మిద్ద గ్రామంలో పట్టా భూములకు ఎకరాకు రూ. 25 లక్షలకు పైగా పరిహారాన్ని అందించడం విశేషం.
రికార్డుల్లో టీజీఐఐసీని తొలగించాలని..
గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వని రైతుల భూములపై రాత్రికిరాత్రే అవార్డులు పాస్ చేశారు. భూ రికార్డుల్లో రైతుల పేర్లను తొలగించి టీజీఐఐసీ పేరు నమోదు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే టీజీఐఐసీ పేరు తీసేసి రైతుల పేర్లు మార్చుతామని హామీ ఇచింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతులకు న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలో దాదాపు 2,211 ఎకరాల పట్టా భూములకు సంబంధించి రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయించాలని వారు మళ్లీ ఆందోళనబాట పట్టారు. గ్రామాల్లో ర్యాలీలు తీస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సీఎంఓ అధికారుల ఆదేశాల మేరకు గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు నిఘా పెట్టారు. అనుమతి లేకుండా ర్యాలీలు తీస్తే కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.
భూముల స్వాధీనానికి సిద్ధం
పరిహారం పొందిన భూముల్లో రైతులు మూడేళ్లుగా ఆయా పంటలను పండిస్తూ ఆదాయం పొందుతున్నారు. మళ్లీ బోరుబావులు తవ్వించి వ్యవసాయం చేసుకుంటున్నారు. సాగు చేసిన పంటలు మరో నెల, రెండు నెలల్లో చేతికి రానున్నాయి. ఆ వెంటనే భూములను స్వాధీనం చేసుకుని మళ్లీ సాగు చేయకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు.
హద్దు మీరితే చర్యలు
అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తే సహించేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తే మాత్రం కేసులు నమోదు చేయాల్సి వస్తుంది.
– లిక్కి కష్ణంరాజు,
సీఐ హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్
ఫ్యూచర్ సిటీపై సర్కార్ నజర్
సీఎంఓ నుంచి కచ్చితమైన ఆదేశాలు
రైతుల కదలికలపై పోలీసు శాఖ దృష్టి
ఆటంకాలు లేకుండా నిర్మాణం జరిగేలా చర్యలు
మాట నిలబెట్టుకోవాలి
అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ నేత లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. టీజీఐఐ సీ పేర్ల మీద మార్చేసిన భూ రికార్డులను రైతుల పేర్ల మీద మార్చాలి. అప్పట్లో పట్టా భూములు తీసుకోమని హామీ ఇచ్చారు. ఇప్పుడు అడిగితే అరెస్టులు చేస్తామని అంటున్నారు.
– ముత్యాల రాంచంద్రారెడ్డి, రైతు, నానక్‌నగర్
ఫ్యూచర్ సిటీతో అభివృద్ధి
ఫార్మాసిటీనే రద్దు చేశాక రైతులు మళ్లీ గ్రామాల్లో ర్యాలీలు తీయడం సరైంది కాదు. సీఎంఓ నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. రైతులు చట్టపరిధి దాటి వ్యవహరించొద్దు. పరిహారం పెంపు, ఇతర ప్రయోజనాల కోసం దరఖాస్తులు ఇవ్వండి. ఫ్యూచర్‌సిటీతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
– మల్‌రెడ్డి రంగారెడ్డి,
ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
Comments
Please login to add a commentAdd a comment