![వైభవంగా గోదా కల్యాణం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/14/13ibr30-640081_mr-1736822512-0.jpg.webp?itok=X7jVGmpr)
వైభవంగా గోదా కల్యాణం
మొయినాబాద్: మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య చిలుకూరు బాలాజీ దేవాలయంలో సోమవారం గోదా కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారికి ధనుర్మాస ఆరాధన చేపట్టారు. అనంతరం ఆలయం వెనకభాగంలో ఉన్న అద్దాల మహల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను మండపంలో ఆసీనులను చేశారు. వేద పండితుడు పరావస్తు రంగాచార్యులు చేతులమీదుగా గోదా కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ గోదా కల్యాణం విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు, నరసింహన్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ జ్యూరీకి ఎంపిక
తుర్కయంజాల్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్‌కు చెందిన ఉడావత్ లచ్చిరామ్ దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. లచ్చిరామ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ జ్యూరీకి ఎంపికయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో శాశ్వత సభ్యత్వం కలిగించడంతో పాటు, రూ.10వేల విలువైన పుస్తకాలను ఉచితంగా అందజేసింది. ఈ మేరకు సోమవారం లచ్చిరామ్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి పలు పుస్తకాలను వారికి బహూకరించారు. లచ్చిరామ్ జ్యూరీకి ఎంపిక కావడంపై వారు అభినందనలు తెలిపారు.
చలికి గజగజ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాలను చలి వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రత సాధారం కంటే తక్కువగా నమోదవుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తోడు పొగమంచు కూడా దట్టంగా వ్యాపిస్తోంది. దీంతో ఉదయం వేళల్లో ప్రయాణాలు సాగించే వారికి రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 2.3 డిగ్రీలు తక్కువ. రాబోయే మూడు రోజులు రాత్రి పూట ఉష్ణోగ్రత మరింత తగ్గుముఖం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు, రాత్రి వేళ ఉద్యోగాలు, పనులు చేసేవారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
చైనీస్ మాంజా
విక్రయాలకు చెక్
చాంద్రాయణగుట్ట: ప్రమాదాలకు కారణమవు తున్న నిషేదిత చైనీస్ మాంజా విక్రయాలు జరగకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నామని నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపారు. పురానీహవేలీలోని తన కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది లంగర్ హౌజ్‌లో చైనీస్ మాంజాతో ఆర్మీ జవాన్ మృతి చెందడం, ఎన్నో పక్షులు కూడా ప్రమాదాలకు గురవడాన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 1వ తేదీ నుంచి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశానుసారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర పర్యవేక్షణలో నగర వ్యాప్తంగా ఏడు ప్రత్యేక టీమ్‌లతో మాంజా విక్రయాలపై దృష్టి సారించామన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదు చేసి 148 మంది వ్యాపారులను పట్టుకున్నామ న్నారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.90 లక్షల విలువైన 7,335 మాంజా చెరక్ (ఉండ)లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో సౌత్ జోన్‌లో 15 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్–17, ఈస్ట్ జోన్–19, సౌత్ వెస్ట్ జోన్–32, ఈస్ట్ జోన్–19, నార్త్ జోన్–14, సెంట్రల్ జోన్–04, వెస్ట్ జోన్–06 కేసుల చొప్పున నమోదయ్యా యన్నారు. పర్యావరణానికి కూడా హాని చేకూర్చే ఈ మాంజాను ఎవ్వరూ వాడకూడ దని హెచ్చరించారు. ఎవరైనా దాచి పెట్టి విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ సమా వేశంలో ఇన్‌స్పెక్టర్లు ఎస్.రాఘవేంద్ర, సైదబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment