నిఘా నేత్రం.. అంతంత మాత్రం!
మొయినాబాద్: నేరాల నియంత్రణకోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు అలంకారప్రాయంగా మిగిలాయి. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాలు ప్రస్తుతం చాలా గ్రామాల్లో పనిచేయడం లేదు. వాటి మరమ్మతులు, నిర్వహణను ఎవరూ పట్టించుకోవడంలేదు. పంచాయతీల్లో ఆరేళ్ల క్రితం అప్పటి సర్పంచ్‌లు, దాతల సహాయంతో సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో సుమారు 12 నుంచి 32 కెమరాలు బిగించారు. సీసీ కెమరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్, స్క్రీన్‌ను పంచాయతీల్లో పెట్టారు. సర్పంచ్‌లు పదవిలో ఉన్నతం కాలం నిర్వహణను స్వయంగా నిర్వహించారు. వారి పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరి 1తో ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సీసీ కెమెరాల నిర్వహణకు పంచాయతీల నుంచి నిధులు ఇవ్వలేమని చేతులెత్తేశారు. నిర్వహణ గాలికొదిలేశారు. చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదు. కొంత మంది సొంతంగా ఇళ్లు, షాపులు, ఫాంహౌస్‌లలో ఏర్పాటు చేసినవి మాత్రం అక్కడక్కడ పనిచేస్తున్నాయి.
చోరీలు చేసి దొరక్కుండా..
గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయి. చోరీలు చేసి దొరకకుండా తప్పించుకుంటున్నారు. మరోవైపు చిన్నచిన్న గొడవలు పెరుగుతున్నాయి. ఇళ్లలోకి వచ్చి పుస్తెలతాళ్లు, బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. వ్యవసాయ బోర్ల కేబుల్స్ కట్ చేసుకుపోవడం, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి రాగితీగలు దొంగలించడం వంటివి చాలా జరుగుతున్నాయి. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే ఇలాంటి చోరీలు, నేరాలను అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
గ్రామాల్లో కొరవడిన నిర్వహణ
మరమ్మతులకు నోచుకోని వైనం
పెరుగుతున్న నేర ఘటనలు
బాగుచేయించాలి
గ్రామంలో చాలా రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పంచాయతీ అధికారులను అడిగితే తమకేమీ సంబంధం లేదన్నట్లుగా సమాధానం చెబుతున్నారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే సీసీ కెమరాలు బాగు చేయించాలి.
– లోకేష్, సురంగల్, మొయినాబాద్ మండలం
చర్యలు తీసుకుంటాం
మొదటి ప్రాధాన్యతగా హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. గ్రామాల్లో నిర్వహణ బాధ్యత గతంలో సర్పంచ్‌లు చూసేవారు. ప్రస్తుతం సరిగా జరగడం లేదు. దాతల సహకారంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.
– పవన్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, మొయినాబాద్
Comments
Please login to add a commentAdd a comment