తగ్గిన విద్యుత్‌ వినియోగం | - | Sakshi
Sakshi News home page

తగ్గిన విద్యుత్‌ వినియోగం

Published Tue, Jan 14 2025 8:17 AM | Last Updated on Tue, Jan 14 2025 8:17 AM

తగ్గిన విద్యుత్‌ వినియోగం

తగ్గిన విద్యుత్‌ వినియోగం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్రాంతి పండగకు నగరవాసులు తమ ఇళ్లకు తాళాలు వేసి...పల్లెటూర్లకు తరలి వెళ్లారు. అకస్మాత్తుగా గృహాలు, కార్యాలయాల్లో విద్యుత్‌ ఉపకరణాల వినియోగం పడిపోయింది. పారిశ్రామిక వాడల్లోని పలు పరిశ్రమలతో పాటు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించి, కార్యాలయాలకు తాళాలు వేశాయి. ఉత్పత్తులు, రోజువారీ కార్యకలాపాలు నిలిపివేయడంతో రోజు వారి విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. జనవరి 7న అత్యధికంగా 3271 మెగావాట్ల (60.07 మిలియన్‌ యూనిట్లు) విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కాగా, తాజాగా 13న ఏకంగా 2500 మెగావాట్లకు (51.34 మిలియన్‌ యూనిట్లు) పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ వేళ 700 మెగావాట్ల విద్యుత్‌ వాడకం తగ్గడం గమనార్హం. మంగళవారం గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా సంక్రాంతి నేపథ్యంలో చిన్నారులు తమ ఇళ్లపై ఎగరేసే పతంగ్‌లు విద్యుత్‌ తీగల పాలిట శాపంగా మారుతున్నాయి. పతంగ్‌లకు ఉన్న మాంజా వైర్లకు చుట్టుకోవడం, వైర్ల మధ్య చిక్కుకున్న పతంగ్‌లను తీసే క్రమంలో దారాన్ని గట్టిగా లాగడం వల్ల వైర్లు మెలికపడి షార్ట్‌సర్క్యూట్‌లు తలెత్తుతున్నాయి. నిజానికి విద్యుత్‌ సంస్థలు డిమాండ్‌కు మించి సరఫరా చేస్తున్నప్పటికీ..పతంగ్‌ల కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో అంతరాయాలు తప్పలేదు. పండగ పూట తరచూ విద్యుత్‌ అంతరాయాలు తలెత్తడంతో వినియోగదారులు కొంత అసహనానికి గురయ్యారు.

గ్రేటర్‌లో వినియోగం ఇలా..

తేదీ మెగావాట్లు మిలియన్‌ యూనిట్లు

06 3,146 58.80

07 3,271 60.07

08 3,242 60.01

09 3250 59.06

10 3261 60.49

11 2863 56.95

12 2653 52.60

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement