సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ చంద్రమోహన్ యాదవ్
● 32తులాల బంగారం, 30తులాల వెండి
● రూ.1.50లక్షలు అపహరణ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో ఓ ఇంట్లో పనికని వచ్చి 32తులాల బంగారం, 30తులాల వెండి, రూ.1.50లక్షలు చోరీ చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..కొమురవెల్లి గ్రామానికి చెందిన అంబడిపల్లి నాగరాజు తన ఇల్లు గ్రౌండ్ ప్లోర్‌ను కొద్దిరోజులుగా మరమ్మతులు చేయిస్తున్నాడు. ఇంటిపైభాగంలోని రూంలో విలువైన సామాన్లు పెట్టి తాళం వేశారు. ఇంట్లో ప్లంబర్ పని చేస్తున్న గ్రామానికి చెందిన మేడికుంట మల్లేశం శఉదయం ఇంటికి వచ్చి తనపని పూర్తయిందని చెప్పాడు. తన సామాన్లు తీసుకెళ్తానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ క్రమంలో చాయిపోయమని నాగరాజు భార్య అర్చనను అడిగాడు.
ఆమె ఇంట్లోకి వెళ్లి చాయి తీసుకొచ్చి ఇచ్చింది. అది తాగి మల్లేశం బయటకు వెళుతుండగా తన ఇంట్లోని కవర్ ఎక్కడికి తీసుకపోతున్నావు అని అడగగా తన సామాన్లు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అతను వెళ్లిపోయిన అనంతరం 15 నిమిషాల తర్వాత అర్చన బంగ్లాపైన గల బీరువాలో చీరలు తీసుకునేందుకు వెళ్లగా పైగది తాళం పగులగొట్టి అందులోనుంచి 32తులాల బంగారం, 30తులాల వెండి, రూ.1.50లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. తమ ఇంట్లోకి ఎవరూ రాలేదని గ్రహించి వచ్చిన ప్లంబరే తీసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే ప్లంబర్ మల్లేశంకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగింది.
అతను ఇంటి వద్దే ఉన్నట్లు తెలిపాడు. వెంటనే ఆమె తన ఇంటికి రమ్మని కోరగా వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయినట్లు తెలిపారు. వెంటనే నాగరాజు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ చంద్రమోహన్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి మల్లేశం కోసం గాలిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment