![భళా.. జాబ్ మేళా!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07sng30-350120_mr-1738998856-0.jpg.webp?itok=Vo2RSrYd)
భళా.. జాబ్ మేళా!
● జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో ఉద్యోగాలు
● ప్రైవేట్ అనుబంధ సంస్థల్లో ఖాళీల గుర్తింపు
● ఎంప్లాయ్‌మెంట్ కార్డుల రెన్యూవల్
● లబ్ధి పొందుతున్న గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు
సంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలు నిరుద్యోగులకు వరంగా మారాయి. ప్రైవేటు అనుబంధ సంస్థల్లో ఖాళీలను గుర్తించి, నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అర్హతను బట్టి ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారు. పదో తరగతి ఆపై చదివిన వారికి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగితను తగ్గిస్తున్నారు. 2016 నుంచి ఇప్పటివరకు 350 జాబ్ మేళాలు ఏర్పాటు చేయగా 7,500 మంది వరకు నిరుద్యోగులు జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 2,152 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ కార్డు ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కార్యాలయం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తోంది. గతంలో ఎంప్లాయ్‌మెంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని రోజులపాటు కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుత టెక్నాలజీ అనుకూలంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. 18 ఏళ్లు నిండిన వారు ఆధార్, కుల, నివాస, విద్యార్హత ధ్రువపతాలను ఏదైనా నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల ద్వారా httpr://www.employment.telangana.gov.in సైట్‌లో అప్‌లోడ్ చేసి ఎంప్లాయ్‌మెంట్ కార్డును పొందవచ్చు. నిరుద్యోగతను బట్టి జిల్లా కార్యాలయ సిబ్బంది జిల్లాలోని చుట్టుపక్కల ప్రైవేట్ కంపెనీల్లో విజిట్ చేసి అందులో ఉద్యోగ ఖాళీల వివరాలను సేకరిస్తారు. అనంతరం జాబ్ మేళాలు నిర్వహిస్తుంటారు.
వీరు అర్హులు
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, టెక్నికల్ కోర్సులు పూర్తయినవారికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఎంప్లాయ్‌మెంట్ కార్డుతో సీనియారిటిని బట్టి కొన్ని కంపెనీల్లో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. తండాల్లో నిరుద్యోగ మహిళలు, పురుషులకు ఉద్యోగాలపై అవగాహన కల్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా జిల్లా కార్యాలయ సిబ్బంది చొరవ చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment