పటాన్‌చెరుపై పట్టెవరిదో? | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరుపై పట్టెవరిదో?

Published Tue, May 7 2024 6:20 PM

పటాన్‌చెరుపై పట్టెవరిదో?

మెదక్‌ బరిలో లోకల్‌ అభ్యర్థులు
● నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ● ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు యత్నం ● పారిశ్రామికవాడల్లో హోరాహోరీగా ప్రచారం
నీలం మధు

పటాన్‌చెరు: ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయాల్లో పటాన్‌చెరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంత నేతలు అనేక కీలక పదవులు అధిష్ఠించి పాలిటిక్స్‌లో చురుకుగా వ్యవహరించారు. అయితే మెదక్‌ లోక్‌సభ స్థానానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. ఇందిరాగాంధీ ఇక్కడ నుంచే పోటీ చేసిన గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులు పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం.

ముగ్గురు అభ్యర్థులు ఇక్కడివారే..

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు పటాన్‌చెరులోనే చాలాకాలం విలేకరిగా పనిచేసి పేరు పొందారు. ఆయన గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి పారిశ్రామికవాడ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. రఘునందన్‌ దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందకముందు పటాన్‌చెరు పట్టణంలో ఉన్న తన సొంతింటిలో ఉండేవారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ నివాసి. ఆయన గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీగా పటాన్‌చెరు నుంచి అప్పటి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈ ప్రాంతంలోని ప్రతీ సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌ మున్సిపాల్టీలోని గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఆయన బంధువులకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ కొన్ని వందల ఇళ్లను ఈ ప్రాంతంలో నిర్మించింది. తెల్లాపూర్‌ మున్సిపాల్టీలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన గతంలో శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా కూడా పని చేశారు. అప్పట్లో ఆయన పటాన్‌చెరు, ఆర్సీపురం పట్టణ ప్రాంత పౌరులతో మంచి సంబంధాలు ఉండేవి.

పారిశ్రామిక వాడలోని ఓట్లపైనే గురి

మెదక్‌ లోక్‌సభ పరిధిలో సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. పటాన్‌చెరులో అధికంగా ఓటర్లు ఉంటారు. దీంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నియోజకవర్గంపైనే దృష్టి సారించారు. వారికున్న వ్యక్తిగత సంబంధాలు, పరిచయాలతో ఇక్కడి ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ముగ్గురు ఇక్కడే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారందరూ తమకే ఓటు వేస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. ఒడిశా, బీహార్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, తదితర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన కార్మికులను దగ్గర చేసుకునేందుకు ఎంపీ అభ్యర్థులు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. బొల్లారం, అమీన్‌పూర్‌ పట్టణాల్లో బీజేపీ కౌన్సిలర్లు ఉండగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి అన్నివర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని పారిశ్రామిక వాడల్లోనూ నీలం మధుకు వలస కార్మికులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకున్న పరిచయాలతో పటాన్‌చెరు ప్రాంతంలో అధిక ఓట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతు

ఇప్పటివరకు జరిగిన మెదక్‌ ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చినట్లు స్పష్టమవుతుంది. అయితే దుబ్బాకలో బీజేపీ ఉప ఎన్నికల్లో ఓటర్లు రఘునందన్‌రావు ఇచ్చిన విజయం, గతంలో ఇక్కడ ఆలె నరేంద్రను బీజేపీ నుంచి విజయవరించిందనే లెక్కలుకడుతూ బీజేపీ తన విజయవకాశాలను అంచనా వేస్తుంది. అయితే నరేంద్ర తర్వాత బీజేపీకి ఓటర్ల మద్దతు పెద్దగా లేదనే చెప్పాలి. బాగారెడ్డి తర్వాత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎంపీ స్థానం లేకపోవడంతో ఈసారి ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ఏఐసీసీ, పీసీసీ వర్గాలు ప్రణాళికలు రచించాయి. అందరి అంచనాల్లోనూ పటాన్‌చెరులోని ఓటర్లే కీలకం కానున్నారు.

వెంకట్రామిరెడ్డి

రఘునందన్‌

Advertisement
Advertisement