సిలబస్ టెన్‌షన్
పదో తరగతి సిలబస్
10లోపు పూర్తి చేయాలి
70 నుంచి 80శాతం లోపే పూర్తి
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె ప్రభావం
దృష్టి పెట్టిన విద్యాశాఖ
ప్రారంభమైన ప్రత్యేక తరగతులు
సంక్రాంతి తర్వాతైనా పూర్తయ్యేనా!
నారాయణఖేడ్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో టెన్త్ పాఠ్యాంశాలు సకాలంలో పూర్తి చేయడంలో ఈ ఏడాది విద్యాశాఖ వెనుకబడింది. ప్రతీ ఏటా డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచే రివిజన్ నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం బోధనలోనే ఉపాధ్యాయులు వెనుకబడిపోయారు. టెన్త్ పరీక్షలకు ఆయా సెలవులు పోను కేవలం 45రోజులే మిగిలి ఉన్నాయి. ఆలోగా పాఠ్యాంశాలు పూర్తి చేసి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంది. పాఠ్యాంశాల్లో ఉపాధ్యాయులు వెనుకబడిపోయిన పరిస్థితి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలల్లో నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో 80% సిలబస్ పూర్తికాగా కేజీబీవీ, మోడల్ స్కూళ్లల్లో 70% వరకే పూర్తి చేశారు. రాష్ట్ర విద్యాశాఖ ఈనెల 10వ తేదీలోపు పాఠ్యాంశాలు వందశాతం పూర్తి చేసి అనంతరం రివిజన్‌ను నిర్వహించాలని ఆదేశించింది. కానీ కొన్ని సబ్జెక్టుల్లో ఇది సాధ్యం కావడంలేదు.
స్పెషల్ క్లాసులు ప్రారంభం...
టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణతాశాతం పెంపు లక్ష్యంగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ క్లాసులను ప్రారంభమయ్యాయి. ఉదయం 8.15 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం స్కూలు ముగిశాక 4.15 నిమిషాల నుంచి 5.30నిమిషాల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్తయిన సబ్జెక్టుల్లో ఆయా సబ్జెక్టు టీచర్లు పునఃశ్చరణ (రివిజన్) నిర్వహిస్తున్నారు.
45 రోజుల్లోనే సన్నద్ధం చేయాలి
టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి జరగనున్నాయి. ఈలోగా పాఠ్యాంశాలు పూర్తి చేయడంతోపాటు రివిజన్ నిర్వహించాల్సి ఉంది. ఈనెల 11 నుంచి 17వరకు సంక్రాంతి సెలవులున్నాయి. ఈనెల 20 నుంచి పాఠశాలలు తిరిగి రెగ్యూలర్‌గా జరగనున్నాయి. సెలవులన్నీ పోగా పరీక్షలకు 45రోజులు మాత్రమే మిగిలాయి. ఈలోగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది.
కేజీబీవీల్లో సమ్మె ప్రభావం..
సమగ్ర శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ అధ్యాపకులు నెల రోజులపాటు సమ్మెకు దిగడంతో కేజీబీవీ, మోడల్ స్కూళ్లల్లో 70% వరకే సిలబస్ పూర్తయ్యింది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గణితం, ఫిజికల్‌సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 80 నుంచి 90%లోపే పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. గణితం సబ్జెక్టులో త్వరత్వరగా బోధన చేయడం సాధ్యపడదు. దీంతో ఈనెల 10వ తేదీలోపు వందశాతం సిలబస్ పూర్తి కావడం అనుమానమే. గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు ముఖ్యమైన పాఠాలను ఎంపిక చేసి వారికి బోధించి స్లిప్ టెస్టులు నిర్వహించాలని విద్యా శాఖ సూచించింది.
సైన్స్‌లో పూర్తికాలేదు..
సైన్స్ సబ్జెక్టులో పాఠాలు పూర్తి కాలేదు. 80%వరకు పాఠాలు పూర్తి చేశారు. ఇతర సబ్జెక్టుల్లో దాదాపుగా పూర్తయ్యాయి. పూర్తి కాని సబ్జెక్టులను అధ్యాపకులు బోధిస్తున్నారు.
– రమేశ్, 10వ తరగతి, ఉట్‌పల్లి
మ్యాథ్స్‌లో 90%పూర్తి..
మ్యాథ్స్ సబ్జెక్టులో 90% బోధన పూర్తయ్యింది. సైన్స్‌లో 80% వరకే పూర్తయ్యింది. త్వరగా నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటోంది.
– సంతోశ్, 10వ తరగతి, జూకల్ తండా
స్పెషల్ క్లాసులు ప్రారంభించాం
జిల్లాలో జనవరి నుంచి స్పెషల్ క్లాసులు ప్రారంభించాం. సిలబస్ పూర్తి కాని పాఠశాలలపై దృష్టి సారించాం. రివిజన్ కూడా ప్రారంభమయ్యింది. 100% ఫలితాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment