ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు
పటాన్‌చెరు: నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి నూతన రిజర్వాయర్ల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం, అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన నూతన రిజర్వాయర్ల ద్వారా మంచినీటి సరఫరా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులు, మున్సిపల్ చైర్మన్‌లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఓఆర్‌ఆర్ పరిధిలో మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు పైప్‌లైన్‌లు వేస్తామన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో రెండు రిజర్వాయర్లు, పంప్‌హౌస్ పనులు పూర్తయ్యాయని, త్వరలో మంచినీటి సరఫరా చేస్తామని వివరించారు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడ, లాలాబావి కాలనీ, బంధం కొమ్ములలో మూడు రిజర్వాయర్లు పూర్తయ్యాయని..ఈ నెల 20వ తేదీలోపు మంచినీటి సరఫరా ప్రారంభిస్తామని తెలిపారు.
విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రపురం, భారతినగర్ డివిజన్ల పరిధిలో పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మూడు డివిజన్ల పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ స్తంభాల స్థితిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. రానున్న వేసవికాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు నిధుల సమస్య ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమావేశంలో జలమండలి డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ శ్రీధర్, అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, జలమండలి జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment