పతంగి తెచ్చిన పండగ శోభ
సంగారెడ్డి టౌన్: జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి ప్రారంభమైంది. సంక్రాంతి అంటే మొదట గుర్తొచ్చేది పతంగులు వాటి వెంట పరుగులుతీసే పిల్లలు. వారి కోసం ఇప్పటికే మార్కెట్లో పతంగుల దుకాణాలు వెలిశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి గాలిపటాలు, దారాలను తీసుకువచ్చి దుకాణదారులు విక్రయిస్తున్నారు. దీంతో పిల్లలు, పెద్దలు పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. ఈసారి పతంగులు, మాంజా, దారాలు, చరఖా, చిన్న పిల్లలకు బొమ్మలతో వున్న రంగురంగుల పతంగులు మార్కెట్లో ఎక్కువగా వచ్చాయి. పిల్లలు ఇప్పటికే పతంగులను ఎగురవేస్తూ సంక్రాంతి పండగ శోభ తెస్తున్నారు.
అప్రమత్తత అవసరం..
పట్టణాల్లో మైదాన ప్రాంతాలు లేకపోవడంతో పెద్ద పెద్ద భవనాల నుంచి పతంగులను ఎగుర వేస్తుంటారు. పతంగులు పైకి ఎగురవేస్తున్న సమయంలో చిన్నారుల దృష్టి అంతా పతంగుల మీదే ఉంటుంది కానీ పక్క పరిసరాలపై ఉండదు. ఒక్కోసారి విద్యుత్ తీగలకు పతంగులు తగలడం, పగుళ్లు ఏర్పడ్డ గోడలు విరగడం వంటి ఘటనలతో ప్రమాదాలు జరిగే అవకాశముంది. అందువల్ల పతంగులు ఎగురవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వీటికి తోడు చైనా మాంజాల వినియోగం పర్యావరణానికి హాని కలిగించడంతోపాటు పశు, పక్ష్యాదులకు ప్రాణ నష్టం కలుగజేసే అవకాశమున్నందున వీటి వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. చైనా మాంజాల కారణంగా చేతులు తెగడం, పక్షులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గాలిపటాలు తెంపడానికి చైనా మాంజా సౌకర్యంగా ఉంటుంది. పోటాపోటీగా ఆకాశంలో ఎగురుతున్న పతంగి కోసేందుకు చైనా మాంజాతోనే సాధ్యపడుతుంది. కొన్ని రసాయనాలను కలిపి తయారు చేయడంతో దారం గట్టిగా అవుతుంది. దీనితో ప్రమాదాలకు కారణం అవుతుంది.
ఇవీ జాగ్రత్తలు...
గోడలు, భవనాలు బాల్కనీల పైనుంచి గాలిపటాలు ఎగురవేయకూడదు.
చిన్న చిన్న గస్తీలు, భారీ భవన సముదాయాలు విద్యుత్ తీగలు, సెల్ ఫోన్ టవర్ల సమీపంలో ఎగురవేయకూడదు.
పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలు, వాటిపై పడితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అలా తీసుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
గాలిలో ఎగురుతున్న పతంగిని చూసుకుంటూ వాహనాలు గమనించకుండా వెళ్తుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది.
నిషేధిత చైనా మాంజా వినియోగంతో గాలిపటాలు ఎగురవేసేవారి చేతి వేళ్లు తెగుతున్నాయి. పైగా రహదారులపై వెళ్తున్న వారి మెడకు బిగుసుకుపోవడంతో గొంతు దగ్గర గాయాలవుతున్నాయి.
పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పక్కనే ఉండాలి.
కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న
చిన్నారులు, యువకులు
జిల్లాలో ప్రారంభమైన
సంక్రాంతి సందడి
చైనా మాంజాలు అమ్మితే కఠిన చర్యలే
జాగ్రత్తలు పాటించాలంటున్న
అధికారులు
చైనా మాంజా అమ్మితే చర్యలు
ప్రమాదకర ప్లాస్టిక్, చైనా మాంజాలను వినియోగించకూడదు. నిషేధిత ప్లాస్టిక్, చైనా మాంజాల అమ్మకాలపై జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ అధికారులతో కలిసి దాడులు చేస్తున్నాం. చైనా మాంజాల వాడకం వలన ప్రతీ ఏటా అనేక మూగజీవులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వినియోగానికి దూరంగా ఉండాలి. పక్షులకు చుట్టుకుని వాటి ప్రాణాలు కోల్పోతున్నాయి. మాంజాలు వాడేవారిపైనా, అమ్మేవారిపైనా కేసులు నమోదు చేస్తాం.
–వేణుగోపాల్, అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment