నిబద్ధతతో డ్యూటీ చేయాలి
● డీజీ అభిలాష బిస్త్
సంగారెడ్డి జోన్: పోలీసు శాఖలో అధికారులు తమకు కేటాయించిన విధులు నిబద్ధతతో నిర్వహించాలని డీజీ అభిలాష బిస్త్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆమె మల్టీజోన్ ఐజీ–2 సత్యనారాయణతో కలసి పరిశీలించారు. ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయం, ఆయుధగారం, మోటార్ వెహికల్ సెక్షన్ తనిఖీ చేసి, పలు రికార్డులను తనిఖీ చేశారు. గతేడాది జరిగిన నేరాలు, వాటి నివృత్తికి జిల్లా పోలీసుశాఖ తీసుకున్న చర్యలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఎస్–నాబ్, ట్రాఫిక్ రద్దీ నివారణకు తీసుకున్న చర్యల గురించి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరించారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ...సిబ్బంది బిల్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
ఖైదీలకూ ఉచిత న్యాయ సేవలు
జిల్లా న్యాయ సేవాధికారి రమేశ్
సంగారెడ్డి టౌన్: ఖైదీలు కూడా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి రమేశ్ తెలిపారు. కందిలోని సెంట్రల్ జైలును బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఖైదీలకు సరైన ఏర్పాట్లు ఉండాలని కనీస సదుపాయాలు అందేలా చూడాలన్నారు. ఖైదీలకు సమయానికి మూలాఖత్ అందించాలని జైలు అధికారులకు సూచించారు. ఖైదీలతో మాట్లాడిన అనంతరం వారి కోసం వండిన భోజనాన్ని రుచి చూశారు.
పునరావాసం కల్పించండి
నిమ్జ్ బాధితుల నిరసన
జహీరాబాద్ టౌన్: రైతులు, రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోరుతూ బుధవారం నిమ్జ్ భూ బాధితులు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముంగి, ఎల్గోయి, ముంగి తండా, బర్దిపూర్ తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం జహీరాబాద్ ఏరియా క్యాదర్శి బి.రాంచందర్ మాట్లాడుతూ...గత ప్రభుత్వం పాలనలో నిమ్జ్ ప్రాజెక్టు కోసం జీవో 123 ప్రకారం భూసేకరణ చేపట్టిందని, ఎకరాకు రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఇస్తున్నట్లుగా ఎకరాకు రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment