వ్యాపార దృష్టితో చూడొద్దు
పటాన్‌చెరు టౌన్: మారుతున్న కాలానికనుగుణంగా విద్యా బోధన జరగాలని, విద్యను వ్యాపార దృష్టితో కాకుండా పిల్లల భవిష్యత్ దృష్టితో చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటీ చౌరస్తాలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....ప్రభుత్వ ఉద్యోగులు లేదా వ్యాపారవేత్తలు కాకుండా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని సూచించారు. పాఠశాలలో చదివే విద్యార్థులు తెలంగాణ అభివృద్ధిలో కీలకం కావాల ని ఆకాంక్షించారు. తాను విద్యార్థి నాయకుడిగా విద్యా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని, పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ సాధన కోసం పనిచేశానని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు పునరుద్ధరణ తరగతులు జరుగుతాయో అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా టీచర్స్‌కు బోధనపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్‌లో పనిచేసే టీచర్లు, ఇతర సిబ్బంది సమస్యలను గుర్తిస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీకి ట్రస్మా సంఘం తొత్తుగా ఉండొద్దని సూచించారు. సంఘం సమస్యలు, పాఠశాల సమస్యలు పరిష్కరించుకునేందుకే సంఘం కృషి చేయాలని తెలిపారు. తెలంగాణ సంపద 60 శాతం విద్యార్థులు తెలంగాణ ఆస్తి రూపంలో మీ ముందు ఉందని తెలిపారు.
ఉపాధ్యాయుడి పాత్ర కీలకం: గూడెం
భావి భారత పౌరులను తయారు చేయడంలో ప్రతీ ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమైనదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు పాఠశాలలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌రావు, కోశాధికారి రాఘవేంద్రరెడ్డి, సంఘం ప్రతినిధులు సాయి తేజ, జనార్దన్‌రెడ్డి, విలియమ్స్, ప్రభాకర్‌రెడ్డి, మహేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మారుతున్న కాలానుగుణంగా
విద్యా బోధన
ట్రస్మా సమావేశంలో మంత్రి పొన్నం
హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment