వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తిరుపతిరెడ్డి
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఎన్. శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్‌గా బి.చందు, డైరెక్టర్లు బొడిగె పరశురాములు, పత్తిపాక త్రిమూర్తి, ఓరుగంటి భారతీదేవి, పోతుగంటి బాలయ్య, ఎండీ కుతుబుద్దీన్, బొంగోని శ్రీనివాస్, లావుడ్యా బిక్యా, మడప యాదవరెడ్డి, రవి, బైకని శ్రీనివాస్, తేరాల మారుతి, తణుకు ఆంజనేయులు, అలాగే సింగిల్ విండో చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఏడీఏ, మున్సిపల్ చైర్ పర్సన్‌లను సభ్యులుగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో
గెలుపే లక్ష్యం కావాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఈశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంపల్లి యాదగిరి అన్నారు. సిద్దిపేట పట్టణంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజలలో ఉంటూ, సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఓం ప్రకాష్, జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి శంకర్, కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
అనుమతులు లేని
ఆశ్రమాలపై చర్యలు
సంగారెడ్డిజోన్: అనుమతులు లేకుండా దివ్యాంగుల ఆశ్రమ, ప్రత్యేక పాఠశాలలు, పునరావాస కేంద్రాలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి తెలిపారు. చట్టం ప్రకారం నిర్వహించే సంస్థలు ఈ నెల 25లోగా జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హామీల అమలుపై
ప్రభుత్వాన్ని నిలదీస్తాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి
మాట్లాడుతున్న మోహన్‌రెడ్డి
గజ్వేల్: కాంగ్రెస్ 11నెలల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చాటుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీల్లో ఒకటిరెండు ప్రారంభించినా మిగతా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలు కష్టాలు పడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ విధానాలపై డిసెంబర్ 1నుంచి 5వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ, నందన్‌గౌడ్, ఎల్లు రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, కుడిక్యాల రాములు, శివకుమార్, శశిధర్‌రెడ్డి, దేవులపల్లి మనోహర్, పంజాల ఆశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగిరం చేయండి
ములుగు(గజ్వేల్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని జిల్లా సహకార అధికారి నాగేశ్వర్‌రావు నిర్వాహకులకు సూచించారు. నర్సాపూర్‌లోని వరిధాన్యం కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని వేరువేరుగా మిల్లులకు పంపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
‘అందె’ భాస్కర్‌కు పురస్కారం
మిరుదొడ్డి(దుబ్బాక): అందె గ్రామానికి చెందిన అందె భాస్కర్ శుక్రవారం దేశ రాజధాని డిల్లీలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకున్నారు. డప్పు వాయిద్యాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అందె భాస్కర్‌కు ఈ పురస్కారం దక్కడం విశేషం. ఢిల్లీలో జరిగిన యువ పురస్కారంలో మినిష్టర్ ఆఫ్ కల్చర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏకే శుక్ల నుంచి పురస్కారాన్ని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment