రెవెన్యూ డివిజన్ అయ్యేనా!
● అసెంబ్లీలో మంత్రి ప్రకటనతో మళ్లీ తెరపైకి ● పెండింగ్‌లోనే ఉన్న దుబ్బాక ● చిరకాల కల నెరవేరుతుందనేఆశతో ఎదురుచూస్తున్న ప్రజలు ● సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంతోపాటు అసెంబ్లీలోనూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రస్తావన
దుబ్బాక పట్టణం వ్యూ..
దుబ్బాక : రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌లపై చర్చిస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దుబ్బాక రెవెన్యూ డివిజన్ కల కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతుందనే ఆశ ప్రజల్లో నెలకొంది. ఈ సమావేశాల్లోనే రెవెన్యూ డివిజన్‌పై ప్రభుత్వం ప్రకటన వెల్లడిస్తుందని నమ్మకంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.
దుబ్బాక రెవెన్యూ డివిజన్‌కు అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో 2016లో ఈ విషయంపై దుబ్బాక పట్టణంలో 45 రోజులపాటు ఉద్యమం తీవ్రంగా జరిగింది. పాత సమితి కేంద్రంగా, తాలుకాగా, నియోజకవర్గం కేంద్రంగా మున్సిపాల్టీగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా కాకపోవడంపై ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్ కోసం నిరంతరం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. నియోజకవర్గం కేంద్రాలైన గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లు చేసి నియోజకవర్గం కేంద్రమైన దుబ్బాకను చేయకపోవడం శోఛనీయమని ప్రజలు వాపోతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి హామీ..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దుబ్బాకలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తప్పకుండా నెరవేరుతుందన్న గంపెడాశ ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది. 8 నెలల కిందట సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేకంగా కలువడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరగడం అందరికీ తెలిసిందే. కాకపోతే తాను దుబ్బాక రెవెన్యూ డివిజన్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసమే సీఎం ను కలిశానని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సీఎం సానుకూలంగా ఉన్నారని తప్పకుండా ఈ దిశగా చర్యలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
92 రెవెన్యూ గ్రామాలతో
డివిజన్
దుబ్బాక నియోజక వర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉండగా చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్‌లో ఉన్నాయి. సిద్దిపే ట డివిజన్‌లో ఉన్న దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి–అక్బర్‌పేట మండలాలతోపాటు గజ్వేల్ డివిజన్‌లో ఉన్న దౌల్తాబాద్, రాయపోల్ మండలాలతో కలిపి మొత్తం 6 మండలాలతో దుబ్బాక రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆరు మండలాల పరిధిలో దుబ్బాక మున్సిపాల్టీతోపాటు 92 రెవెన్యూ గ్రామాలు 115 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2 లక్షలకు పైగా జనాభాతో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్, ఐసీడీఎస్, వ్యవసాయ శాఖ సబ్ డివిజన్, పీఆర్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, హర్టీకల్చర్ సబ్ డివిజన్ కార్యాలయాలతోపాటు బస్ డిపో ఉంది. కాబ ట్టి డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఉద్యమం తీవ్రతరం చేస్తాం
దుబ్బాక రెవెన్యూ డివిజన్ కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి, మేధావులతో కలిసి ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకొని అఖిల పక్షం ఆధ్వర్యంలో సీఎం, మంత్రులను కలుస్తాం.
– మాడవోయిన శ్రీకాంత్,అఖిల పక్షం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment