సంక్షోభంగా మారిన సంక్షేమం
● 6 గ్యారంటీలు, 66 హామీలనువిస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ● రాష్ట్రంలో రైతుల, విద్యార్థుల మరణాలు కలిచివేస్తున్నాయి ● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికాసం వెంకటేశ్వర్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమం సంక్షోభంగా మారిందని, అభివృద్ధి అవినీతిగా మారిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో వెంకటేశ్వర్లు విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అవినీతి తప్ప ఎక్కడ అభివృద్ధి దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రతి పక్షాలపై నిందలు వేయడం తప్ప సీఎం చేసిన ఒక్క మంచి పని లేదన్నారు. రేవంత్ రెడ్డి లక్కీగా సీఎం అయ్యాడని ఆయనకు పరిపాలన చేయడం తెలియదని విమర్శించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో 50 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వనందుకు లగచర్ల రైతులను ఇబ్బందులు పెట్టి వారి చేతులకు సంకెళ్లు వేయడం సిగ్గుచేటన్నారు. వరి ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేసిందన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక హైడ్రా, మూసీ సుందరీకరణ, ప్రతిపక్షాల అరెస్ట్‌లతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ఇప్పటికై నా సీఎం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, దూది శ్రీకాంత్ రెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, విబిషన్ రెడ్డి, కోడూరి నరేశ్, గోనె మార్కండేయులు, లక్కిరెడ్డి తిరుమల, ఉమా సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment