సమాజ సేవకే లీగల్ సర్వీసెస్ అథారిటీ
సిద్దిపేటరూరల్: సమాజంలో హింసలకు, గృహ హింసలకు, లైంగిక వేధింపులు గురయ్యే పేదలకు సేవ చేసేందుకే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉందని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో లైంగిక వేధింపులు, గృహ హింసల చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వాతిరెడ్డి హాజరై మాట్లాడారు. ఎవరైనా పని ప్రదేశాల్లోగాని, మరెక్కడైనా గాని లైంగికంగా వేధింపులకు గురి చేస్తేఅధైర్య పడకుండా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్ 15100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. అంతకుముందు ఏసీపీ మధు మాట్లాడుతూ.. మహిళలపై ఎలాంటి అరాచకాలు జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, 24 గంటల పాటు పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందని డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అనంతరం స్వాతిరెడ్డిని గ్రామ మహిళలు ఘనంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ అపూర్వరెడ్డి, మల్లేశం, పంచాయతీ కార్యదర్శి గౌస్, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment