సమాజ మార్పునకు పూలే శ్రీకారం
● సావిత్రిబాయి స్ఫూర్తితో ముందుకు సాగాలి
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
● కలెక్టరేట్‌లో జయంతి వేడుకలు
సిద్దిపేటరూరల్: సమాజ మార్పునకు సావిత్రిబాయి పూలే శ్రీకారం చుట్టారని, అందరూ ఆమె స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని నిర్మించిన ప్రేమస్వరూపిణి సావిత్రిబాయి పూలే అన్నారు. పూలే జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందన్నారు.
కలెక్టర్‌కు న్యూఇయర్ శుభాకాంక్షలు..
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులు శుక్రవారం కలెక్టర్ మనుచౌదరిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పోలీస్ కమిషనర్ అనురాధ, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్,డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీఓలు, జిల్లా, ఔట్‌సోర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment