నాచగిరి ఈఓ అన్నపూర్ణ బదిలీ
● ఇన్‌చార్జిగా సిద్దిపేట ఈఓ
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ అన్నపూర్ణ బదిలీ అయ్యారు. ఆమె నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో సిద్దిపేట వేంకటేశ్వరాలయ ఈఓ పార్నంది వెంకటేశ్వరశర్మకు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సోమవారం వెంకటేశ్వరశర్మకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో తనకు సహాయ సహకారాలు అందించిన అర్చకులకు, సిబ్బందికి, ఆలయ పరిధిలోని గ్రామస్తులకు, తోడ్పాటు అందించిన దాతలకు ఈఓ అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాం
గజ్వేల్‌రూరల్: విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్‌కు బాటలు వేయడమే తమ కర్తవ్యమని మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ట్రైనర్ రోహిణి అన్నారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ శోభారాణి ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం సమక్షంలో సోమవారం మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడారు. తమ సంస్థ ద్వారా కళాశాలలోని తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఎంప్లాయిమెంట్ ఎబిలిటీ స్కిల్స్, సాఫ్ట్, లైఫ్ స్కిల్స్, కేరీర్ టాక్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కమలా క్రిస్టియాన, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్స్ సంఘంజిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చిన్నకోడూరు కళాశాల ప్రిన్సిపాల్ కూచంగారి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సంఘంలో ఖాళీ అయిన సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను త్వరలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి భర్తీ చేస్తామన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌ను సన్మానించి అభినందించారు.
మైనార్టీలకు ఉచిత కుట్టుమిషన్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా క్రిస్టియన్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి షేక్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ, నిరుపేద, వితంతువులు, అనాథ, ఒంటరి మహిళలు ఈ నెల 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment