‘ఆత్మీయ భరోసా’ లేనట్లే?
● మల్లన్నసాగర్ నిర్వాసితులకు మరో దెబ్బ! ● జలాశయం నిర్మాణంలో సర్వం కోల్పోయి.. భూమి లేని పేదలుగా మారిన వైనం ● పథకం వర్తించదన్న సంకేతాలతో ఆందోళన బాట ● గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
ఆందోళన ఉధృతం చేస్తాం
భూమి లేని తమకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ ఏడాదికి రూ.12వేల పంపిణీ చేసే పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ మల్లన్నసాగర్ నిర్వాసితులు గురువారం గజ్వేల్‌లోని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వీరికి డీబీఎఫ్(దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పి. శంకర్, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి, జిల్లా కార్యదర్శి వేణులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ వీవీఎల్ చంద్రళకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు మరో షాక్ తగిలింది. పెండింగ్ సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిర్వాసితులకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కూడా అందేలా లేదు. జలాశయ నిర్మాణంలో సర్వం కోల్పోయి భూమిలేని రైతు కూలీలుగా మారిన నిర్వాసితులకు గతంలో భూమికి పరిహారం ఇచ్చామనే కారణంతో ఏడాదికి రూ.12వేలు ఇచ్చే ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం లేదని తెలుస్తున్నది. అన్ని గ్రామాలకు పథకానికి సంబంధించిన జాబితాలకు విడుదల కాగా ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి సంబంధించి మాత్రం ఇంకా జాబితా వెలువడకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఈ క్రమంలో నిర్వాసితులు ఆందోళనబాట పట్టారు. గురువారం గజ్వేల్‌లోని ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఏళ్లుగా తీరని సమస్యలు..
మల్లన్నసాగర్ జలాశయ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన విషయం కూడా విదితమే. ఆయా ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మించి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏటిగడ్డకిష్టాపూర్‌లో 1253, లక్ష్మాపూర్‌లో 388, వేములగాట్‌లో 1252, పల్లెపహాడ్‌లో 921, రాంపూర్‌లో 320, బ్రహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో మరో 330కుపైగా కుటుంబాలున్నాయి. కాగా ఆయా గ్రామాల్లో భూమితో ఇతర ఆస్తులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.7.5లక్షలు, ఇల్లు. ఇల్లు వద్దంటే వారికి ఓపెన్ ప్లాటు, మరో రూ.5లక్షలు పంపిణీ చేశారు. అంతేకాకుండా కుటుంబంలో 18ఏళ్ల పైబడిన వారుంటే ఇల్లు లేదంటే ఒపెన్‌ప్లాటు, రూ.5లక్షలు ఇచ్చారు. ఇంకా ఎన్నో సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితులు గత కొన్నేళ్లుగా చేయని ప్రయత్నాలు లేవు. పలుసార్లు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయినా ఏళ్ల బరబడి ఈ సమస్యలు తీరడం లేదు.
నిర్వాసితుల్లో ఆందోళన..
ఇదే క్రమంలో తాజాగా భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేల పంపిణీ చేసే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం వర్తింపజేసే అవకాశం లేదని తెలిసి నిర్వాసితులు ఆందోళన చెందుతు న్నారు. భూములకు గతంలో పరిహారం వచ్చిందనే కారణంతో ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదని తెలుస్తున్నది. జలాశయం నిర్మాణంలో సర్వం కోల్పోయి, ప్రస్తుతం గుంట వ్యవసాయ భూమిలేని స్థితిలో మెజార్టీ నిర్వాసితులు ఉన్నారు. వీరి కోసం పరిశ్రమలను స్థాపించి ఉపాధి కల్పిస్తామన్న పభుత్వ హామీ కూడా నెరవేరలేదు. మరో ముఖ్యమైన విషయమేమీటంటే ఉపాధి హామీ పథకం కూడా ఈ గ్రామాలకు వర్తించడం లేదు. పని దొరకక భూమిలేని పేదలు అల్లాడుతున్నారు. వారంతా ఆందోళన బాటపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment