పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
హుస్నాబాద్‌రూరల్: నియోజకవర్గాన్ని పర్యటక కేంద్రాంగా తీర్చిదిద్దనున్నట్లు, ఇందుకు ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి పంపించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఉమ్మాపూర్‌లోని మహాసముద్రం గండిలో కరీంనగర్ కశ్మీర్‌గడ్డ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాసముద్రం, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్, గౌరవెల్లి ప్రాజెక్టు, ఉమ్మాపూర్‌లోని సర్వాయి పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. నిత్యం మార్నింగ్ వాకింగ్‌ను అందరూ అలవర్చుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పోతారం(ఎస్) గ్రామంలో మంత్రి తాగునీరు ట్యాంక్‌ను ప్రారంభించారు. కూచనపెల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకస్థాపన చేసి, ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. కూచనపెల్లి నుంచి మాలపల్లి వరకు నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. పందిల్ల స్టేజీ నుంచి పొట్లపల్లి మీదుగా ఆరెపల్లి వరకు రూ.3.95 కోట్లతో నిర్మించే తారు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాలపల్లిలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి సీసీ రోడ్డు నిర్మాణముకు శంకుస్థాపన చేశారు.
వైశ్యులు రాజకీయాల్లోకి రావాలి
హుస్నాబాద్: వైశ్యులు వ్యాపారంతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో జరిగిన జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్యవైశ్య యువజన, మహిళా విభాలకు అభినందనలు తెలిపారు. వ్యాపారంతో ఆర్థిక అభివృద్ధి సాధించే వైశ్యులు రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులను ప్రోత్సహించడమేకాకుండా అండగా ఉంటుందన్నారు. అక్కన్నపేట దగ్గరలో 10 ఎకరాల్లో గోశాల నిర్మాణముకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు తనుకు ఆంజనేయులు నాయకులు పాల్గొన్నారు.
పాపన్న గుట్టలను సుందరంగా మారుస్తా
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment