బడి బయట ఎందరో? | - | Sakshi
Sakshi News home page

బడి బయట ఎందరో?

Published Mon, Jan 20 2025 7:08 AM | Last Updated on Mon, Jan 20 2025 7:08 AM

బడి బ

బడి బయట ఎందరో?

బడీడు పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ కచ్చితంగా చదువుకోవాలి. కానీ వివిధ కారణాల వల్ల అనేక మంది చదువులకు దూరం అవుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు గుర్తించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడీడు పిల్లల గుర్తింపు సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ నెల 25 వరకు కొనసాగనుంది.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బడి బయట ఉన్న పిల్లల వివరాలను నమోదు చేసి, వారిని తిరిగి బడికి వచ్చేలా చేసే సదుద్దేశంతో విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు చెందిన చిన్నారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణాలు, పౌల్ట్రీ రంగం, ఇటుక బట్టీలు, సీజనల్‌ పనుల నిమిత్తం ఒడిశా, బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తదితర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తున్నారు. దీంతో వీరికి సమీపంలో పాఠశాలలు లేకపోవడంతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో చిన్నారులు చదువులకు దూరం అవుతున్నారు. ఇలాంటి చిన్నారులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మూడు విభాగాలుగా..

ఇందులో విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించారు. 6 నుంచి 14 ఏళ్లు (ప్రాథమిక), 15 నుంచి 19 ఏళ్లు (సెకండరీ), ఇంతవరకు పాఠశాలలో నమోదు కానీ (నెవర్‌ ఎన్‌రోల్‌) వారిగా విభజించారు. గత 2023–24 విద్యాసంవత్సరంలో సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు 456, సెకండరీ స్థాయి విద్యార్థులు 398, పాఠశాలలో ఎన్‌రోల్‌ కాని చిన్నారులు 350మంది, మొత్తంగా 1204 మంది విద్యార్థులను గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 584 విద్యార్థులను, సెకండరీ స్థాయిలో 107, పాఠశాలలో ఎన్‌రోల్‌ కాని చిన్నారులు 499మంది, మొత్త 1190 మందిని గుర్తించారు. మెదక్‌ జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు 246, సెకండరీ స్థాయి 165, పాఠశాలలో ఎన్‌రోల్‌ కాని చిన్నారులు 57మందిని, మొత్తం 468 మందిని గుర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,862 మంది విద్యార్థులను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్పించి విద్యను అందించారు.

3వేలకు పైగా బయటే!

ఈ విద్యాసంవత్సరం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దాదాపుగా 3వేలకుపైగా బడీడు పిల్లలు బయట ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిని గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. పాఠశాలలకు దూరంగా ఉన్న చిన్నారులకు వర్క్‌ సైట్‌ స్కూల్‌లను ప్రారంభించి విద్యాబోధన చేయనున్నారు. ఈ వర్క్‌ సైట్‌ స్కూల్‌లలో ఆ చిన్నారి మాతృభాషలోనే విద్యాభ్యాసం చేయనున్నారు. వీరితో పాటు మధ్యలో విద్యాభ్యాసం మానేసిన బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు.

గత విద్యా సంవత్సరం గుర్తింపు ఇలా..

ప్రాథమిక స్థాయి విద్యార్థులు: 1,286

సెకండరీ స్థాయి.. : 670

నెవర్‌ ఎన్‌రోల్‌.. : 906

మొత్తం విద్యార్థులు: 2,862

బడీడు పిల్లల గుర్తింపునకు చర్యలు

జిల్లాలో కొనసాగుతున్న సర్వే

పాల్గొంటున్న 274 మంది సీఆర్పీలు

గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 2,862 మంది చిన్నారుల గుర్తింపు

అందరికీ విద్య అందించడమే లక్ష్యం

బడి ఈడు చిన్నారులందరూ విద్యను అభ్యసించాలి. కొందరు కొన్ని కారణాల వల్ల చదువులకు దూరం అవుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు జిల్లాలో సర్వే కొనసాగిస్తున్నాం. గుర్తించిన చిన్నారులకు సమీపంలోని పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందిస్తాం. సీఆర్పీలు ప్రతి హ్యాబిటేషన్‌ క్లస్టర్‌లను సందర్శించి చిన్నారులను గుర్తిస్తున్నారు.

–భాస్కర్‌, సిద్దిపేట జిల్లా

అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
బడి బయట ఎందరో?1
1/1

బడి బయట ఎందరో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement