మాకు రేషన్ కార్డులు రావా?
● సర్వే లిస్టులో మా పేర్లు లేవు ● పాలమాకుల గ్రామస్తుల నిలదీత ● మళ్లీ దరఖాస్తులు స్వీకరించిన అధికారులు
నంగునూరు(సిద్దిపేట): ‘కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నాం.. అధికారుల తప్పిదంతో సర్వే లిస్టులో మాపేర్లు గల్లంతయ్యాయి. మాకు రేషన్ కార్డులు రావా’ అంటూ పాలమాకుల గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గురువారం నంగునూరు, పాలమాకుల, గట్లమల్యాల, సంతోష్‌నగర్, కోనాయిపల్లి గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించారు. పాలమాకులలో తహసీల్దార్ సరిత అధికారులతో కలిసి గ్రామానికి చేరుకొని ఇంటింటా సర్వే చేపట్టారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితా ప్రకారం సర్వే చేస్తున్నామని తహసీల్దార్ సమాదానం ఇచ్చారు. గ్రామంలో సుమారు 900 మంది కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. పూర్తి జాబితా వచ్చేంత వరకు సర్వే చేయవద్దని అడ్డుకున్నారు. సర్వేను అడ్డుకోవద్దని అధికారులు చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల వినతి మేరకు తహసీల్దార్ సరిత కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. వారి సూచన మేరకు గ్రామస్తుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. అలాగే నంగునూరు, కోనాయిపల్లి గ్రామాల ప్రజలు కూడా సర్వేలో తమ పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment