భారత గడ్డపై శ్రీలంక జట్టు ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడితే 11 ఓడిపోయింది...9 ‘డ్రా’ కాగా, ఒక్కటంటే ఒక్కటీ గెలవలేకపోయింది! ఈ రికార్డు చూస్తే శ్రీలంకతో స్వదేశంలో భారత్ టెస్టు మ్యాచ్ అమితాసక్తి రేపే అవకాశం లేదు. కానీ ఈ సిరీస్‌కు టీమిండియా దృష్టిలో ప్రత్యేకత ఉంది. భారత టెస్టు జట్టు 35వ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో దిగుతుండగా...ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన విరాట్ కోహ్లి తన 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. పైగా 2012 తర్వాత పుజారా, రహానే ఇద్దరూ లేకుండా తొలి సారి టెస్టు ఆడబోతున్న భారత్ యువ బ్యాటర్లతో మార్పుకు శ్రీకారం చుట్టింది. మరో వైపు ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న లంక మెరుగైన ప్రదర్శనతో ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం.
మొహాలి: కొంత విరామం తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి పీసీఏ స్టేడియంలో నేటినుంచి జరిగే తొలి టెస్టులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో భారత్ 9 టెస్టులు ఆడాల్సి ఉండగా...అందులో ఇది మొదటిది. వరుస విజయాలు సాధిస్తే గానీ ఫైనల్ చేరే అవకాశం లేని టీమిండియా ఈ క్రమంలో లంకపై విజయంతో శుభారంభం చేయాలని కోరుకుంటోంది. వన్డేలు, టి20ల్లో కెప్టెన్‌గా ఇప్పటికే రుజువు చేసుకున్న రోహిత్ టెస్టు నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది.
అవకాశం ఎవరికో?
చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బరిలోకి దిగిన జట్టుతో పోలిస్తే భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి. రోహిత్‌తో పాటు మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగో స్థానంలో ఎప్పటిలాగే ఆడనున్న కోహ్లి తన కెరీర్‌లో చిరస్మరణీయ మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంది. 100 టెస్టులు ఆడిన 71వ క్రికెటర్‌గా నిలవనున్న మాజీ కెప్టెన్ 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ తనదైన దూకుడు కనబర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్‌లో అశ్విన్, జడేజా జంట మరోసారి ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టేందుకు సిద్ధమైంది.
మూడో స్పిన్నర్‌ను ఆడించే అవకాశం ఉంటే బ్యాటింగ్ కూడా చేయగల జయంత్ యాదవ్‌కు తొలి ప్రాధాన్యత దక్కవచ్చు. పేస్ విభాగంలో బుమ్రాకు తోడుగా రెండో పేసర్‌గా సీనియర్ షమీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు పేసర్లకే పరిమితమైతే సిరాజ్‌కు చోటు కష్టమే. అన్నింటికి మించి పుజారా, రహానే స్థానాలను భర్తీ చేసే విషయంలోనే పోటీ నెలకొని ఉంది. శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్‌లలో ఇద్దరికే చాన్స్ ఉండటంతో ఎవరిని పక్కన పెడతారో చూడాలి. మొత్తంగా ప్రత్యర్థితో పోలిస్తే భారత్ అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది.
కరుణరత్నేపైనే భారం!
శ్రీలంక జట్టులో ఎక్కువ మంది జూనియర్లే ఉన్నారు. వీరికి భారత్‌లో ఆడిన అనుభవం దాదాపుగా లేదు. సీనియర్ మాథ్యూస్ కొంత వరకు బాధ్యతలు తీసుకోనుండగా ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే ప్రదర్శనే కీలకం కానుంది. గత రెండేళ్లుగా కరుణరత్నే అద్భుత ప్రదర్శనతో ప్రపంచంలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిడిలార్డర్‌లో ధనంజయ డిసిల్వ కీలకం. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంబుల్‌డెనియాపై కూడా లంక ఆశలు పెట్టుకుంది. భారత గడ్డపై మురళీధరన్‌లాంటి దిగ్గజం కూడా 45 సగటు నమోదు చేశాడంటే మనపై స్పిన్నర్ ప్రభావం చూపించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. మీడియా సమావేశాన్ని బట్టి చూస్తే లంక ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే ఆలోచనలో కనిపిస్తోంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), మయాంక్, విహారి, కోహ్లి, శ్రేయస్, పంత్, జడేజా, అశ్విన్, జయంత్, షమీ, బుమ్రా.
శ్రీలంక: కరుణరత్నే (కెప్టెన్), తిరిమన్నె, నిసాంక, మాథ్యూస్, దనంజయ, చండిమాల్, డిక్‌వెలా, లక్మల్, ఎంబుల్‌డెనియా, జయవిక్రమ, కుమార
పిచ్, వాతావరణం
ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించినా మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు బాగా స్పందిస్తుంది. సాధారణ వాతావరణం, వర్ష సూచన లేదు.
‘నిజాయితీగా చెప్పాలంటే వంద టెస్టులు ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. వంద టెస్టుల మైలురాయిని చేరుకునే క్రమంలో ఎంతో క్రికెట్ ఆడాను, ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు దాటాను. ఇక్కడి వరకు రాగలగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నా ఫిట్‌నెస్ కోసం చాలా శ్రమించాను. దేవుడు నాకు అండగా నిలిచాడు. నాకు, నా కుటుంబ సభ్యులు, కోచ్‌కు ఇది చాలా గర్వపడే క్షణం.ఆసీస్ గడ్డపై సాధించిన నా తొలి సెంచరీని ఎప్పటికీ మరచిపోలేను. టెస్టు క్రికెట్ కోసం నేను నా సర్వం వెచ్చించాను. దేశం తరఫున ఆడటమే అన్నింటికంటే పెద్ద ప్రేరణ కాబట్టి మరో ఆలోచన అవసరం లేదు. వందో టెస్టు సందర్భంగా భావోద్వేగానికి గురి కావడం లేదని చెబితే అది అబద్ధమాడుతున్నట్లే’
– విరాట్ కోహ్లి (తన 100వ టెస్టు సందర్భంగా)
‘ఒక టెస్టు జట్టుగా ప్రస్తుతం మేం మంచి స్థానంలో ఉన్నామంటే ఆ ఘనత కోహ్లిదే. ఇన్నేళ్లుగా అతను జట్టును తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అతను ఎక్కడ ముగించాడో నేను అక్కడినుంచే కొనసాగించబోతున్నాను. తొలి టెస్టునుంచి 100వ టెస్టు వరకు విరాట్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ ఫార్మాట్‌లో తాను గొప్పగా ఆడుతూనే జట్టును కూడా ముందుకు తీసుకెళ్లాడు. కోహ్లికి నా అభినందనలు. ఈ టెస్టును అతని కోసం మరింత ప్రత్యేకంగా మార్చాలని భావిస్తున్నాం. 2013లో జొహన్నెస్‌బర్గ్‌లో ప్రతికూల పరిస్థితుల మధ్య పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని చేసిన సెంచరీ నా దృష్టిలో విరాట్ అత్యుత్తమ ప్రదర్శన’ – రోహిత్ శర్మ, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment