ఐపీఎల్‌లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల భారత ఆల్‌రౌండర్లు చాలా నష్టపోతున్నారని వాపోయాడు.
వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి వారు తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నాడు. ఓవరాల్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు తాను అభిమానిని కాదని పేర్కొన్నాడు. వినోదం కోసం నిబంధనలను ఇంతలా సడలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
తాజాగా జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోడ్‌కాస్ట్‌లో రోహిత్ క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు.
కాగా, ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2023 సీజన్‌లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అన్ని జట్లు అవసరానికి అనుగుణంగా ఓ అదనపు ప్లేయర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తొలుత బ్యాటింగ్ చేసే జట్టు అదనంగా ఓ బ్యాటర్‌ను వినియోగించుకుంటుంది. అలాగే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అదనంగా ఓ బౌలర్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
మొత్తంగా చూస్తే 11 మంది ఆడాల్సిన క్రికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల 12 మంది క్రికెట్‌గా మారింది. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నారు. దీని వల్ల వారిని ఆల్‌రౌండర్లుగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో ఆల్‌రౌండర్లకు డిమాండ్ ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఏదో ఒక విభాగానికే పరిమితమైతే వారి కెరీర్‌లు ఇరుకున పడే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment